బీమా భరోసా..!
ABN , Publish Date - Nov 19 , 2026 | 11:47 PM
రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో ప్రకటించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది.
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రభుత్వ శ్రీకారం
- గతంలో కేవలం రైతులకే.. ఇప్పుడు అందరికీ వర్తింపు
- రేషన్ కార్డు ఉండి.. 18-59 సంవత్సరాల మధ్య వారికి అర్హత
- కుటుంబంలో సంపాదించే సభ్యుడికి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్
- ఉమ్మడి జిల్లాలో 10.42 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు
ఆంధ్రజ్యోతి, మహబూబ్‌నగర్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో ప్రకటించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సిద్దిపేట జిల్లాలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించి.. దరఖాస్తు ఫారాన్ని విడుదల చేశారు. గతంలో 18 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య ఉండి, భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే బీమా పథకం ఉండేది. గత బడ్జెట్లో దాని స్థానంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రవేశపెట్టి.. 1.15 కోట్ల మందికి వర్తింపస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 2 నుంచే ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉండగా, అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈలోపు రైతుబంధు పాలసీ గడువు ఆగస్టుతో ముగిసింది. అయినా ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడం, ఆ తర్వాత చాలామంది రైతులు మరణించడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉన్న పథకాన్ని రద్దు చేసి.. కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత లేకపోవడంతో రైతు లు కూడా ఇబ్బందులు పడ్డారు. అయితే మొత్తం మార్గదర్శకాలను సి ద్ధం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట బహిరంగ సభలో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే గ్రామాలు, మండలకేంద్రాలు, మునిసిపాలిటీల్లో అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి నెలరోజుల పాటు దరఖాస్తుల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. రైతుబీమా పథకం కింద కేవలం భూమి ఉన్నవారే లబ్ధి పొందేవారు. రాష్ట్రంలో 2018 నుంచి పథకం నిలిచిపోయే వరకు 1.86 లక్షల మంది రైతులు మరణించగా.. వారి కుటుంబాలకు రూ. 9,107.80 కోట్ల పరిహారం లభించింది. ఆ తర్వాత చనిపోయిన వారు ఈ పథకం కింద అర్హులు కాకుండా పోయారు. ఇప్పుడు భూమి ఉన్నవారే కాకుండా, రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ పథకం కింద అర్హత సాధించనున్నారు. అలాగే ఈ కుటుంబ బీమాలో గతంలో ఇతర పథకాల కింద రూ. 2లక్షల మేర బీమా కలిగి ఉన్న మత్స్యకారులు, గీతకార్మికులు, నేత కార్మికులను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. దానివల్ల ప్రయోజనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 10,42,594 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీరిలో మెజారిటీ కార్డుదారులకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం వర్తించే అవకాశాలు ఉన్నాయి.
సంపాదించే వారికి అవకాశం
గతంలో ఉన్న బీమా పథకాలు దాదాపు కుటుంబ యజమానికి మాత్రమే వర్తించేవి. ఉదాహరణకు రైతుబీమా కేవలం పట్టా ఉన్న రైతులకు మాత్రమే వర్తించేది. ఇంట్లో సంపాదించే వ్యక్తి కాకపోయినా అతడినే యజమానిగా పరిగణించేవారు. అలాగే అతడి వయ సు 59 ఏళ్లు దాటితే అనర్హత ఉండేది. కేవలం బీమా కోసం భూబదలాయింపు కూడా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఇంట్లో సంపాదించేది వేరే వ్యక్తులు అయినప్పటికీ, వారి పేరుపైన భూమి లేకపోవడంతో అర్హత లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా తెస్తున్న బీమా పథకంలో కొంత వెసులుబాటు కల్పించారు. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య పెరగనున్నట్లు స్పష్టమవుతోంది. ఇంటి యజమానితో సంబంధం లేకుండా ఇంట్లో సంపాదించే వ్యక్తుల పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఉదాహరణకు రాష్ట్రంలో మెజారిటీ రేషన్ కార్డులకు యజమానులుగా మహిళలే ఉంటారు. తల్లి లేదా భార్య పేరుతో కార్డులు ఉన్నా యి. గతంలో పథకాల ప్రకారం ఆ యజమానురాలికే పథకం వర్తిస్తుంది.. కానీ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో ఆమె తన కుటుంబంలో ఎవరైతే సంపాదిస్తున్నారో ఆ వ్యక్తులనే యజమానిగా నమోదు చేయవచ్చు. అలాగే ఒకవేళ ఆ యజమాని వయసు 59 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న సమయంలోనూ మిగతా కుటుంబ సభ్యులను ప్రతిపాదించవచ్చు. దీనివల్ల కేవలం వృద్ధులు మాత్రమే ఉన్న రేషన్ కార్డులు మినహా మిగతా కుటుంబ సభ్యులు ఉన్నవారికి బీమా వర్తించనుంది. గతంలో రైతుబీమా పథ కం కింద ఉమ్మడి జిల్లాలో మొత్తం 3.35ల క్షల మంది రైతులు ఉంటే.. భూయజమాని అర్హత, 18-59 సంవత్సరాల వయసు కారణంగా కేవలం 2.39లక్షల మంది మాత్రమే పథకం కింద నమోదయ్యారు. మిగతా దాదాపు 94వేల మందికి అర్హత లభించలేదు. ఇప్పుడా పరిస్థితి దాదాపు ఉండదు.. 95 శాతం రేషన్ కార్డుల్లో ఆ మధ్య వయసు ఉండి ఉపాధి పొందుతున్నవారు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
బీమా సొమ్మూ పంచవచ్చు
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కింద మరో అప్షన్ ఇచ్చారు. సాధారణంగా ఏదైనా జీవితబీమా నమోదు చేసుకున్నప్పుడు మెజారిటీ సభ్యులు నామినీలుగా ఒకరినే పెడతారు.. దేశం లో గతంలో నుంచే నామినీలను ఒకరి కంటే ఎక్కువగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉన్నా.. దాన్ని జీవిత బీమా ఏజెంట్లు సరిగా తెలపరు.. కేవలం ఒక నామినీని మాత్రమే పాలసీ తీసుకునే సమయంలో నమోదు చేయిస్తారు. గతంలో రైతుబీమా సమయంలోనూ ఇదే తరహా విధానం అమలు చేశారు. కానీ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో ఒకరి కంటే ఎక్కువ నామినీలను నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ముందుస్తుగా ఈ విషయంపై అధికారులు అవగాహన కల్పించడం ద్వారా లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేసుకుంటారు. దీనివల్ల సంపాదించే వ్యక్తి మరణించిన తర్వాత వచ్చే బీమా సొమ్ముపై వాగ్వాదాలు కూడా ఉండవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చాలా కుటుంబాల్లో పెద్ద మరణించిన తర్వాత బీమా సొమ్ము కోసం గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నామినీల సంఖ్యను లబ్ధిదారు తన ఇష్టపూర్తిగా పెట్టుకోవడంతోపాటు.. ఎవరెవరికి ఎంత శాతం బీమా సొమ్ము లభించాలో కూడా పేర్కొనే అవకాశం ఉంది. ఒకవైపు సంపాదించే వ్యక్తులకు పథకం వర్తింపు, ఒకరి కంటే ఎక్కువ నామినీల నమోదు ఈ పథకంలో ప్రత్యేకంగా చెప్పవచ్చు.