ముస్తాబవుతున్న ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:19 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకంలో పూర్తైన ఇంటి నిర్మాణాలకు లబ్ధిదారులు గృహప్రవేశాలకు సిద్ధం చేస్తున్నారు.
- సమయానికి ఖాతాల్లో డబ్బులు
- వేగంగా నిర్మాణ పనులు
కోయిలకొండ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకంలో పూర్తైన ఇంటి నిర్మాణాలకు లబ్ధిదారులు గృహప్రవేశాలకు సిద్ధం చేస్తున్నారు. మండలంలో మొదటి విడుతలో 786 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 618 ఇంటి నిర్మాణాలకు ముగ్గువేసి పనులు ప్రారంభించారు. ఇందులో బెస్‌మెంట్ వరకు 517, చెత్తు నిర్మాణాల వరకు 399, చెత్తు వరకు పూర్తి అయిన పనులు 299 ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు 10 పైగానే ఇంటి నిర్మాణాలు పూర్తి అయ్యాయి. అనంతాపూర్ గ్రామంలో గత నెల క్రితం ఇంటి నిర్మాణానికి గృహప్రవేశం నిర్వహించగా కోయిలకొండ, రామన్నపల్లి తదితర గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు విసృతంగా కొనసాగుతున్నాయి. గతంలో ఇందరమ్మ ఇళ్లు మంజూరైన వారు పనులు ప్రారంభించేందుకు వెనుకంజ వేయగా, గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి పనులు ప్రారంభించిన వారికి బెస్‌మెంట్, రూప్‌లెవల్, చెత్తు వేసిన వారికి బిల్లులు త్వరగా పడుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పనులు ప్రారంభించని వారు ఇంటి పనులు ప్రారంభిస్తున్నారు. చెత్తు వరకు పనులు పూర్తికావడంతో మూడు విడుతలుగా రూ.3.40 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలతో గ్రామాల్లో మేస్త్రీలతో పాటు కూలీలకు డిమాండ్ పెరిగింది. వచ్చే నెలలో రెండో విడుత ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు మంజూరు కానుండగా, మొదటి విడుతలో మంజూరు కాని వారికి రెండో విడుతలో మంజూరవుతాయని ఎదురు చూస్తున్నారు.