పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:14 PM
నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
- జిల్లాలో దడ పుట్టిస్తున్న ప్రయాణం
- హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డుపైనే అధికం
- మరమ్మతు చేపట్టని అధికారులు
నాగర్‌కర్నూల్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు దారి పొడవునా దాబాల్లో మద్యం విక్రయాలు రోడ్డు ప్రమాదాలకు మూల కారణంగా మారుతున్నాయి. వారాంతపు సెలవులు, శ్రీశైలం మల్లన్న ను దర్శించుకునే క్రమంలో పర్యాటకులు, భక్తులు ప్రమాదాల బారిన పడ డం ఆందోళనకు గురిచేస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఫారెస్టు, శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి ప్రతీ ఏటా రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తారు. పర్యాటకులు, భక్తుల రద్దీకి అనుకూలంగా సౌకర్యాలు కల్పించడంలో రహ దారుల భవనాల శాఖతోపాటు అటవీశాఖ కూడా నిర్లీప్తతను ప్రదర్శిస్తుండ డంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రధానంగా శ్రీశైలం ఘాట్ రోడ్డులోని మన్ననూర్ ములోని కుంచ నుంచి మొదలుకుని వటవర్ల పల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు కూలిపోయిన కూడా అధికారయంత్రాంగంలో ఎలాంటి చలనం లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. 8నెలల వ్యవధిలో జిల్లాలో రోడ్డుప్రమాదాల సంఖ్య గణనీ యంగా పెరిగింది. 2024-25తో పోలిస్తే ఇప్పటి వరకు 4శాతం అధికంగా రోడ్డు ప్రమాదాలు జరగడం గమనార్హం. 2024లో 186రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2025 సంవత్సరాంతం వరకు 202 రోడ్డు ప్రమాదాలు నమోదు కావడం గమనార్హం.
జిల్లాలో పెరిగిన డ్రంకెన్‌డ్రైవ్‌ల సంఖ్య
నియంత్రణ లేకుండా వెలుస్తున్న బెల్టుషాపులు కారణంగా నాగర్ కర్నూ ల్ జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజక వర్గాల్లో డ్రంకెన్‌డ్రైవ్‌ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 3,294డ్రంక్ అండ్‌డ్రైవ్ కేసులు నమోదు కాగా వారి నుంచి రూ.26,3407 జరిమానా వసూలు చేశారు. 267మంది జైలు పాలయ్యారు.