డీసీసీబీ చైర్మన్ రేసులో...!
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:44 PM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎంపిక ప్రక్రియ పూర్తవుతోంది.
- నారాయణపేట డీసీసీ చీఫ్ ప్రశాంత్‌రెడ్డికే దక్కుతుందనే ప్రచారం
- గతంలో ఆయన తండ్రి వీరారెడ్డికి ఎండీసీసీబీలో సుదీర్ఘ అనుభవం
- తనకు మరోసారి అవకాశం కోరుతున్న మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి
- ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన పీఏసీఎస్‌ల పాలకవర్గాల ఎంపిక
- అన్ని నియోజకవర్గాల్లో పూర్తయిన తర్వాత డీసీసీబీ ఎంపిక ప్రక్రియ
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎంపిక ప్రక్రియ పూర్తవుతోంది. పలు జిల్లాలో ఇప్పటికే అనేక సొసైటీలకు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, వైస్‌చైర్మన్, డైరెక్టర్ల నియామకాలు జరుగుతుండగా.. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ పదవిపై ఉత్కం ఠ నెలకొంది. జిల్లాల విభజన అనంతరం కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉన్న ఏకైక పదవి కావడంతో అంత ఆసక్తి ఏర్పడుతోంది. అలాగే ప్రతీ జిల్లా నుంచి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా తమకు రాజకీయంగా అండగా ఉన్నవారికే ఈ అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తుండగా.. నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కె. ప్రశాంత్‌రెడ్డికి ఈ పదవి దక్కడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలోనే ఆయనకు చైర్మన్ హామీ ఉండగా.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయన తండ్రి వీరారెడ్డి ఎమ్మెల్యేగా పని చేయడంతో పాటు పలు పర్యాయాలు మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లాలో ఆయన ఎక్కువ మందికి సుపరిచితమే.. వీరారెడ్డి మరణానంతరం పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన ప్రశాంత్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించారు.
అప్పటి వరకు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వాకిటి శ్రీహరికి ఆ టిక్కెట్ దక్కిం ది. ఆయన ఎన్నికల్లో గెలవడం, సీఎం హామీ మేరకు గెలిచిన తొలిసారే మంత్రిగా నియమితులు అవడం జరిగిపోయాయి. అప్పట్లో నియోజకవర్గాల పెంపు తర్వాత ప్రశాంత్‌రెడ్డికి అవకాశం కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. దాంతో పాటు డీసీసీబీ చైర్మన్‌ను కూడా చేస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే నియోజకవర్గాల పెంపుపై ఇప్పటివరకు స్పష్టత రావడం లేదు. డీలిమిటేషన్ బిల్లులో అనేక అవాంతరాలు ఉండటం..
పార్లమెంట్‌లో 1/3 ఆమోదం రాకపోవడంతో బిల్లు వీగిపోవడం వంటి అంశాలతో గందరగో ళం నెలకొంది. ఈ నెల చివరి నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ విషయమై స్పష్టత వస్తుందనే ప్రచారం ఉంది. ఒకవేళ నియోజకవర్గాల పెంపు లేకపోతే మాత్రం కచ్చితంగా ప్రశాంత్‌రెడ్డిని డీసీసీబీ చైర్మన్ పదవి వరించడం ఖాయమనే ప్రచారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉంది. గతంలోలా ఎన్నిక పద్ధతి కాకపోవడంతో సులభంగా నామినేట్ చేయవచ్చు. ఈ విషయంలో పార్టీ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చిందని సమాచారం.
మరొకరు కూడా పోటీ...
డీసీసీబీ చైర్మన్ రేసులో ప్రశాంత్‌రెడ్డితో పాటు మొన్నటివరకు డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి మరోసారి తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మహబూబ్‌నగర్ డీసీసీబీని గతంలో బీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి చెందడం, డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన నిజాంపాషా అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకోవడంతో అనివార్యంగా కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి వచ్చింది. దీంతో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు చక్రం తిప్పి.. పానగల్ మండలంలో పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్న విష్ణువర్దన్‌రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా గడువు పెంచడంతో ఆయన కొనసాగారు. ఇప్పుడు నామినేటెడ్ పద్ధతిలో పీఏసీఎ్‌సలకు, డీసీసీబీకి చైర్మన్లు, డైరెక్టర్ల ఎంపిక చేస్తుండటంతో మామిళ్లపల్లికి మరోసారి అవకాశం దక్కుతుందా? లేదా అనేది వేచిచూడాలి. డీసీసీబీ పదవిని చాలామంది ఆశించే అవకాశం ఉన్నప్పటికీ.. వీరిద్దరి పేర్లు మాత్రమే ఇప్పటివరకు ప్రఽధానంగా వినిపిస్తున్నాయి. ఒకసారి నాగర్‌కర్నూలు పార్లమెంట్‌కు చైర్మన్ పదవి ఇచ్చిన దృష్ట్యా.. ఈసారి మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కే ఇవ్వాలని భావిస్తే కచ్చితంగా ప్రశాంత్‌రెడ్డికే పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ప్రత్యక్ష ఎన్నికలు జరిగినా.. ప్రశాంత్‌రెడ్డికి అవకాశం ఇస్తారని అప్పట్లో కూడా ప్రచారం జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉండటం, గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఉండటంతో ఆయన ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రారంభమైన ఎంపిక ప్రక్రియ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020లో ఎన్నికలు జరిగాయి. బీఆర్‌ఎస్ దాదాపు అన్ని సొసైటీలను కైవసం చేసుకుని.. మహబూబ్‌నగర్ డీసీసీబీ పీఠాన్ని కైవసం చేసుకుంది. సొసైటీల పదవీకాలం 2025 ఫిబ్రవరిలో ముగిసింది. దీంతో ప్రభుత్వం 2025 ఆగస్టు 14 వరకు అంటే దాదాపు ఆరు నెలల పదవీకాలాన్ని పొడిగించింది. ఆ తర్వాత 2025 ఆగస్టు 14న మళ్లీ పొడగిస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు లేదా ఆరునెలల పాటు కొనసాగుతాయని పేర్కొంది. ఆ తర్వాత డిసెంబర్ 19న పాలకవర్గాలను రద్దు చేస్తూ.. సొసైటీలకు పర్సన్ ఇన్‌చార్జిలను నియమించింది. దీనిపై చాలా సొసైటీలు కోర్టుకు వెళ్లాయి. ఆలా వెళ్లిన సొసైటీల్లో కొంతమేర పాతవారినే కొనసాగించాలని ఆదేశించింది. ఇదే సమయంలో డిసెంబర్ 23న వ్యవసాయ మార్కెట్ కమిటీల మాదిరిగానే నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేయాలని నిర్ణయించింది. కొన్ని జిల్లాల్లో ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తిచేయగా.. ఉమ్మడి జిల్లాలో మొన్నటివరకు ప్రక్రియ ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమైంది. అలంపూర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తవతున్నట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తమ జాబితాలను పంపించగా.. ప్రభుత్వ పరిశీలన అనంతరం నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక చేసి జాబితాలను జిల్లాకు పంపించనున్నారు. అయితే పాలకవర్గాలను ఎంపిక చేస్తూ పంపిస్తున్న ఉత్తర్వుల్లో వారి పదవీకాలం ఎప్పటివరకు అనే విషయాన్ని పొందుపరచకపోవడం గందరగోళంగా ఉన్నట్లు తెలుస్తోంది.