అక్రమ నియామకాలు?
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:22 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో సమగ్రశిక్ష కార్యాలయంలో పని చేసేందుకు ఎక్కువ మంది మక్కు వ చూపుతున్నారు.
- ‘సమగ్రశిక్ష’ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లు
- అన్నీ తానై నడిపిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి!
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లాలో సమగ్రశిక్ష కార్యాలయంలో పని చేసేందుకు ఎక్కువ మంది మక్కు వ చూపుతున్నారు. అక్కడి సెక్టోరియల్, ఇతర పోస్టుల చాల మంది ఉపాధ్యాయులు పైరవీలు చేసుకొని పని చేసేందుకు తహతహలాడుతున్నారు. సమగ్రశిక్ష కార్యా లయంలో మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి. నిబంధ నల ప్రకారం పరీక్ష రాసి సెక్టోరియల్స్ అయిన ఏఎంవో, సీఎంవో, జీసీడీవోలు పనిచేస్తున్నారు. మిగతా వారిని మాత్రం పాఠశాల విద్యాశాఖ, కలెక్టర్ అనుమతి లేకుం డా జిల్లా విద్యాశాఖ అధికారి నియమించుకున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకోసం నిబంధనలకు విరు ద్ధంగా అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులను కొత్తగా తీసుకొచ్చారు. ఇదేమిటని అడిగితే పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నామని చెప్తున్నారు.
ఆ పోస్టులంటే ఎందుకంత మోజు?
ఉపాధ్యాయులు సాధారణంగా విద్యార్థులకు బోధిం చి, వారికి న్యాయం చేసేందుకు అధికంగా ఇష్టపడతా రు. కానీ కొందరు మాత్రం అందుకు విరుద్ధంగా ఆలో చిస్తున్నారు. తమకు ఇష్టమైన చోటకు డిప్యుటేషన్ తీసు కొని వచ్చామా.. వెళ్లామా.. అన్నట్లుగా పని చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎంతో కొంత డబ్బు వెనుకేసుకోవచ్చన్న ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ, సమగ్రశిక్ష కార్యాలయాల్లో పనిచేస్తే, ఒత్తిడి ఉండదని, ప్రశాంతంగా వచ్చి, వెళ్లిపో వచ్చన్న భావనలో ఉన్నట్లు సమాచారం. ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే ఆఫీసు పనిమీద వెళ్లామంటూ సాకు చెప్పుకోవచ్చుని, అందుకే ఈ పోస్టులపై మోజు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సమగ్ర శిక్షలోనే ఐదుగురు...
జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 మంది వరకు టీచర్లు నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తి స్తున్నారు. అయినా ఉన్నతాధికారులు ఎటువంటి చర్య లూ తీసుకోవడం లేదు. ఇలా సమగ్ర శిక్ష కార్యాలయం లో ఐదుగురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌ఫై పని చేస్తు న్నారు. వారిలో అదనపు ఏఎంవోలుగా ఇద్దరు, అదనపు ఏంఐఎస్‌గా ఒకరు, ప్లానింగ్ అధికారిగా ఇంకొ కరు పనిచేస్తున్నారు. ఎంఐఎస్ కోఆర్డినేటర్‌గా మరొకరు నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరి కొందరు పాఠశాలకు డుమ్మాకొట్టి, మండల కేంద్రా ల్లో ఎంఈవోల వద్ద సహాయకులుగా పనిచేస్తున్నారు. ఇదంతా తెలిసినా డీఈవో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
పాఠశాలల్లో బోధనకు ఇక్కట్లు
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వ సూచన మేరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. కానీ అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాట్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చా యి. విద్యాసంవత్సరం చివరి దశకు వచ్చిన తర్వాత కూడా కొందరు ఉపాధ్యాయులు తమకు అనువైన చోటికి డిప్యుటేషన్ తీసుకుంటున్నట్లు విమర్శలున్నాయి. గత డిసెంబర్‌లో ఐదుగురు ఉపాధ్యాయులు మెడికల్ గ్రౌండ్స్ పేరుతో ఇతర పాఠశాలలకు డిప్యుటేషన్ తీసు కు న్నారు. దీంతో కొన్ని పాఠశాలల్లో విద్యాబోధనకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయి.