అంటకాగితే అంతే....!
ABN , Publish Date - Nov 17 , 2026 | 11:36 PM
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఐదేళ్లకోసారి మారుతుంటాయి.. అధికారులు ఒక్కసారి ని యామకమైతే పదవీవిరమణ వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
- ప్రభుత్వాధికారులు జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలు
- నేతల అడుగులకు మడుగులు ఒత్తితే భవిష్యత్‌లో నష్టం
- కొన్ని శాఖల్లో నాయకుల మద్దతుతో అధికారుల ఓవరాక్షన్
- గత ప్రభుత్వంలో ఇలానే వ్యవహరించిన వారిపై ఫోకస్
- ఇప్పటికే వేగం పెంచిన అవినీతి నిరోధక శాఖ బృందాలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఐదేళ్లకోసారి మారుతుంటాయి.. అధికారులు ఒక్కసారి ని యామకమైతే పదవీవిరమణ వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పిందే రైటు.. నేతలకు సెల్యూట్ అనే విధంగా తయారయ్యారు. ప్రజాప్రతినిధులు కూడా తమకు నచ్చిన అధికారులను తెచ్చుకోవడం, నచ్చని వారిని పంపించడం వంటివి కూడా చేస్తుంటారు. అనుకూలమైన అధికారులైతే రెగ్యులర్ ట్రాన్స్‌ఫర్లు కూడా ఉండవు. సుదీర్ఘకాలం ఒకే కొలువులో, ఒకేచోట కూడా పనిచేస్తుంటారు. అందుకే అధికారులు కూడా నాయకులు చెప్పిన దానికి తలూపుతుంటారు. వారి అవినీతి కార్యకళాపాల్లో భాగస్వాములుగా కూడా ఉంటారు. వారూ కొంత కూడబెట్టుకుంటారు. అయితే అందరూ ఇలానే ఉన్నారని చెప్పలేం కానీ, మెజారిటీ శాఖల్లో అధికారులు నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నారు. ఒక్కోసారి తమ శాఖలోని ఉన్నతాధికారులను కూడా లెక్కచేయరు. నేతలు కూడా ప్రొటోకాల్‌ను ఫాలో కాకుండా కిందిస్థాయి అధికారులను ఉపయోగించి తమకు నచ్చిన పనులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడా పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు అవినీతి నిరోధక శాఖ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికార వ్యవస్థలో ఉన్న సాధారణ అవినీతిని నిర్మూలించడంతో పాటు నాయకులతో అంటకాగే వారిపైనా ఏసీబీ దృష్టి పెడుతోంది. గత ప్రభుత్వంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి మొదలుకొని ఫార్ములా ఈ రేస్, తాజాగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో పనిచేసి నేతలతో అంటకాగిన వారిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులను నమోదు చేస్తోంది. వారి ప్రతీ లావాదేవీలను పరిశీలిస్తోంది. ఎక్కడ చూసినా వేలు, వందల కోట్లలో అధికారులు ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారిక ప్రకటనల్లో పేర్కొనడంతో ప్రజలు విస్తుపోతున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా తమ ఆదేశాలను లెక్క చేయకుండా వ్యవహరించిన వారు ఇలా డీఏ కేసుల్లో పట్టుబడుతుంటే లోలోపల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భయం పోయిందా?
గతంలో అధికారులు ఉన్నతాధికారుల నుంచి మెమోలు వస్తేనే చాలా అవమానంగా భావించేవారు. సస్పెండ్ చేస్తే ఇంకా తలెత్తుకోలేనంత ఇబ్బంది పడేవారు. సర్వీసు బుక్‌లో రిమార్క్ ఎక్కడ పడుతుందోననే ఆందోళన వారిలో ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితిలో అధికారులు లేరు.. ఏసీబీ అధికారుల దాడుల తర్వాత కూడా చాలామంది పశ్చాత్తాపం లేనట్లుగానే కనిపిస్తున్నారు. వారి జీవితహక్కుగా భావిస్తున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ సమయంలో బెరకు కనిపించడం లేదు. దీనికి కూడా కారణం నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండమేననే భావన ఉన్నది. కొద్దిరోజులు గడిచిన తర్వాత ఎవరో ఒక నేతను పట్టుకొని ఏదో ఒక చోట పోస్టింగ్ సాధించుకోవచ్చనే ధీమానే కారణంగా చెప్పవచ్చు. నేతల మద్దతు లేనివారు మాత్రం చాలా ఏళ్లు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ప్రధానంగా ఏసీబీ కేసులపై భయం పోయిందా? ఉద్యోగం ఎలాగూ పోదనే ధీమానే కారణమవుతుందా? అంటే మెజారిటీ ప్రజలు అవుననే సమాధానం చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ఇలాంటి అధికారులు చాలామంది ఉన్నారు. ఆర్‌ఐల నుంచి ఆర్డీఓల వరకు కూడా నేతల కనసన్నల్లో నడుస్తున్నారు. తాజాగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఈఈ సత్యనారాయణగౌడ్ కూడా గత ప్రభుత్వంలో నేతలతో చాలా సన్నిహితంగా మెలిగే వారనే విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు ఆయనపై దాడులు జరిగిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ సమస్య ప్రధానంగా రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, ఇతర ఇంజనీరింగ్ శాఖల్లో ఎక్కువగా ఉన్నది. ఎక్కువ డబ్బు ప్రవాహం ఉండేది ఈ శాఖల్లోనే ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వంలో ప్రతీ జిల్లాలో నేతలకు సన్నిహితంగా మెలిగిన వారిపై వస్తున్న ఫిర్యాదులకు అనుగుణంగా ఏసీబీ కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దాడుల సమయంలోనే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన అధికారులపై కూడా దాడులు ఉంటాయని భావించారు. కానీ, చాలా ఆలస్యంగా ఇప్పుడిప్పుడే ఈ దాడులు మొదలుకాగా ఇంకా కొందరు అధికారులపై కూడా అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తులపైనే ఫోకస్ ఉండనుంది.
బిల్లుల కోసం జేబుల చిల్లు...
ఏదైనా శాఖలో పనులు చేసి బిల్లులు కోసం వెళ్లాలంటే సదరు కాంట్రాక్టర్లు తమ జేబులకు చిల్లులు కచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఎంతోకొంత ఇవ్వడం కాదు బాజాప్త పర్సంటేజీలు అడుగుతున్న పరిస్థితి. ఇటీవల మహబూబ్‌నగర్ డీవైఎ్‌సఓ రాజశేఖర్‌రెడ్డి కేసు కూడా అలాంటిదే.. క్రీడాకారులకు పలు ఈవెంట్ల సందర్భంగా భోజనాలు పెట్టినందుకు ఓ సరఫరాదారుకు రూ. 3 లక్షలు రావాల్సి ఉంటే అందులో ఏకంగా రూ. లక్ష డిమాండ్ చేయడం, దాన్ని వసూలు చేస్తుండగా ఏసీబీ పట్టుకున్నది. ఇలా అన్ని శాఖల్లోనూ జరుగుతోంది. నాయకులకు అనుకూలంగా ఉంటే పోస్టింగులు పొందవచ్చనే విధానం అన్నింటిలో కంటే పోలీసుశాఖలో చాలాబాగా అమలవుతోందని చెప్పవచ్చు. మెజారిటీ పోలీస్ స్టేషన్లలో నేతల రికమండేషన్ వల్ల పోస్టింగులు పొందిన వారే అధికంగా ఉండటం దీన్ని స్పష్టం చేస్తుంది. అలా చేయని వారు నాన్ ఫోకల్ పోస్టులకు పరిమితమవుతుంటారు. మంచి స్టేషన్‌లో రావాలన్నా నేతల ముందు వారి అనుయాయుల కంటే ఎక్కువగా దాసోహంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇలా వ్యవహరించిన వారు ఈ ప్రభుత్వంలో నాన్ ఫోకల్ పోస్టులకు పరిమితమయ్యారు. లేదా సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించడంతో ఉలికిపాటుకు గురవుతున్నారు. చాలామంది ఉమ్మడి జిల్లాలోని అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు. అయితే ఫిర్యాదులు అందితేనే ఏసీబీ కదిలే అవకాశం ఉండటంతో కిందిస్థాయి సిబ్బంది లేదా అలాంటి అవినీతి అధికారుల వల్ల ఇబ్బంది పడ్డవారు ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు సంప్రదించవచ్చు. డీఏ కేసుల్లో కొంత సమయం తీసుకున్నా దాడులు చేసి వారిని అరెస్టు చేసే అవకాశం ఉంటుంది.