Share News

కర్ణాటక నీరొస్తే.. నిల్వెక్కడ?

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:54 PM

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరి స్థితుల కంటే.. దాని ఆధారంగా జరుగుతున్న కరువు రాజకీయం విపరీతాలకు దారితీస్తోంది.

కర్ణాటక నీరొస్తే.. నిల్వెక్కడ?
పొలాల నుంచి వచ్చే సీపేజీతో బీచుపల్లి వద్ద నదిలో పారుతున్న నీరు

  • జూరాలలో నిల్వ తగ్గితేనే.. ఎగువ నుంచి వచ్చినా ఉపయోగం

  • రెండు టీఎంసీల మేర తగ్గిన తర్వాతే కొత్త నీటికి అవకాశం

  • వారబందీలో ప్రస్తుతం 5 రోజులు నీరు.. 7 రోజులు బంద్‌

  • వారానికి 3 రోజులే నిలిపివేయాలంటున్న ఆయకట్టు రైతులు

  • ఒప్పందం ప్రకారం కర్ణాటక నుంచి నీరు తీసుకోవాలనే డిమాండ్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరి స్థితుల కంటే.. దాని ఆధారంగా జరుగుతున్న కరువు రాజకీయం విపరీతాలకు దారితీస్తోంది. ఒ కరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి కరువు ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీగా ఉపయో గపడిందని చెప్పవచ్చు. అధికారులు సరైన కా ర్యాచరణ ప్రణాళికను అమలు చేయకపోవడం దగ్గర నుంచి వివాదం ప్రారంభమైంది. మొదట్లో అధికారులు వరి సాగు చేయవద్దని చెప్పినప్పటికీ.. తర్వాత నీరు రావడంతో వారబందీ ప్రకార మైనా ఇస్తామని చెప్పడంతో రైతులు కొంత ఆశతో సాగుచేశారు. ఆ తర్వాత నీటి విడుదలను నిలిపివేయడంతో రైతుల్లో ఆగ్రహం మొదలైంది. దీంతో ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కర్ణాటకకు వెళ్లి.. అక్కడి ముఖ్యమంత్రి డీకే శివకు మార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. 5 టీఎంసీలు విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు కోరినప్పటికీ.. వారబందీ విధానంలో 3 టీ ఎంసీల వరకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత అధికారులు కూడా ఆయకట్టుకు నీటి విడుదలను ప్రారంభించారు. అప్పటి నుంచి వారబందీ పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతోంది. ఎత్తిపోతల పథకాలకు కూడా కొంత మేర నీటిని విడుదల చేశారు. ఇప్పుడు కర్ణాటకకు పోయి నీరు తెస్తామని హామీ తీసుకున్నారు కదా... ఆ నీరు విడుదల చేసుకోవడం లేదేంటి? అని ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమయంలో అధికారులు జవాబు ఇవ్వాల్సి ఉన్నా.. వారు మౌనముద్రకు పరిమితమవుతున్నారు. కొందరు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టులో కొంత నీటి నిల్వ తగ్గితేనే, కొత్తగా నీరు నిల్వ చేసుకోవడానికి వీలు ఏర్పడుతుందని అంటున్నారు. అలా కాకుండా ముందుగానే విడుదల చేసుకుంటే నీటి వృథా తప్పా.. మరే ఫలితం ఉండదని అభిప్రాయపడుతున్నారు. కానీ ఏ విషయమైనా రైతులకు, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది.

వారంలో నాలుగు రోజులు నీరివ్వాలి

ప్రస్తుతం ఇస్తున్న వారబందీ పద్ధతి ప్రకారం రైతులు తమ పొలాలకు తడులు అందిస్తున్నప్పటికీ.. పొట్ట దశలో ఉన్న పంటలు కావడంతో ఎక్కువ రోజులు తడి ఉండాలని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం అయిదు రోజులు నీరు ఇచ్చి.. దాదాపు వారం రోజులు నీటి విడుదలను నిలిపివేస్తున్నారు. దీనివల్ల చివరి వరకు నీరు వెళ్లడం లేదని, పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పంట వచ్చినా తాలు పెరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కర్ణాటక నుంచి ఒప్పందం ప్రకారం నీరు విడుదల చేసుకోవాలని.. ప్రస్తుతం ఉన్న వారబందీ పద్ధతిలో కొన్ని మార్పులు చేసి.. పొట్ట దశలో ఉన్న పంటలను బతికించాలని రైతులు కోరుతున్నారు. వారంలో నాలుగు రోజులు నీరు ఇచ్చి.. మూడు రోజులు నిలిపివేయాలని కోరుతున్నారు. అయితే వారంలోనే అలా నీటి విడుదల చేయడం వల్ల ఆయకట్టులో చాలా వరకు సీపేజీ వచ్చి.. నదిలో కలుస్తోందని, రైతులు వాడుకుంది పోను నదిలో వృథాగా పోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే పొట్ట దశలో నీరు అవసరం కాబట్టి రైతుల విన్న పాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పూర్తి నిల్వకు ఒక టీఎంసీనే తక్కువ..

జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు.. ప్రస్తుతం 8.300 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మినిమం డ్రా డౌన్‌ లెవల్‌ కంటే పైన సుమారు 5.637 టీఎంసీల నీరు ఉండగా.. కాలువల ద్వారా వాడుకోదగిన నీరు 4.593 టీఎంసీలు ఉంది. అయితే కర్ణాటక తాగునీటి అవసరాల దృష్ట్యా నీటి విడుదలకు ఒప్పుకుంది. అది కూ డా నవంబరు వరకు గడువు ఉంది. ఇప్పుడు పైనుంచి నీటిని విడుదల చేసుకోవడం వల్ల నీటిని నిల్వ చేసుకోవడం సాధ్యం కాదని, మళ్లీ దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే ప్రస్తుత నిల్వ కనీసం రెండు టీఎంసీల కంటే ఎక్కువ తగ్గిన తర్వాతనే నీటిని విడుదల చేసుకో వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కర్ణాటకతో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి వెంటనే ఆ నీరు చేరాలనే వాద నను తెరపైకి తేవడం వల్ల ప్రయోజనం లేదని, అవసరాలను బట్టి నీటి విడుదల కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకున్న గడువు మేరకు విడుదల చేసుకుంటామని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. తాగునీటి అవసరాలకు డెడ్‌ స్టోరేజీ పోను మినిమం డ్రా డౌన్‌ లెవల్‌లో కనీసం 2 నుంచి 2.5టీఎంసీల నీరు ఉండాలి. అందుకే ప్రణాళిక ప్రకారం నీటి విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Oct 08 , 2026 | 11:54 PM