గద్వాలలో హైడ్రామా
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:34 PM
నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా గద్వాల మునిసిపాలిటీలో కాంగ్రెస్ బీఫామ్‌ల హైడ్రామా క్లైమాక్స్‌తో ముగిసింది. మంగళవారం ఉదయం మునిసిపాలిటీ ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి నుంచి డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి బీఫామ్‌లను గద్వాలకు తీసుకొచ్చారు.
- ఏడుగురికి బీఫామ్‌లు.. అ తర్వాత ఆరు రద్దు
- ఎమ్మెల్యే వర్గంలో 36 మందికి బీఫామ్‌లు అందజేత
- ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సరిత వర్గం
గద్వాల, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా గద్వాల మునిసిపాలిటీలో కాంగ్రెస్ బీఫామ్‌ల హైడ్రామా క్లైమాక్స్‌తో ముగిసింది. మంగళవారం ఉదయం మునిసిపాలిటీ ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి నుంచి డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి బీఫామ్‌లను గద్వాలకు తీసుకొచ్చారు. అందులో జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గానికి 8, 10, 11, 12, 14, 29, 36 వార్డులకు సంబంధించిన ఏడు బీఫామ్‌లు ఉన్నాయి. మిగిలిన 30 వార్డుల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్గం అభ్యర్థులకు బీఫామ్‌లు ఇస్తారని అందరూ భావించారు. మధ్యాహ్న సమయంలో ఎమ్మెల్యే వర్గంలోని 36 మంది బీఫామ్‌లను మునిసిపాలిటీలోని రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు. అదే సమయంలో సరిత వర్గంలోని ఏడుగురు కూడా బీఫామ్‌లు ఇచ్చేందుకు మునిసిపాలిటికీ చేరుకున్నారు. అప్పటికే ఎమ్మెల్యే వర్గంవారు 36 బీఫామ్‌లు అందించారు. అయినా వీరు కూడా రిటర్నింగ్ అధికారికి బీఫామ్‌లు ఇచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం డీసీసీ అధ్యక్షుడు బీఫామ్‌లు ఇచ్చిన వారి జాబితాతో పాటు సీఫామ్‌ను రిటర్నింగ్ అధికారులకు ఇచ్చేశారు. దీంతో మరో బీఫామ్ పొందిన వారు ఇండిపెండెంట్ అభ్యర్థులను పరగణిస్తారు. దీంతో సరిత వర్గంలోని 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్న శంకర్‌ను మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్తించి, మిగిలిన వారిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గుర్తించినట్లు సమాచారం. దీంతో సరిత వర్గం వారు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఫామ్‌లు ఇచ్చి ఆ తర్వాత ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండాను మోసిన తమను కాదని, కొత్తగా వచ్చిన వారికి బీఫామ్‌లు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ఎవరు కాంగ్రెస్ వారో, ఎవరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారో డీసీసీ అధ్యక్షుడికి తెలియకుండా పోయిందని అంటున్నారు.