Share News

14ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా తప్పనిసరి

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:12 PM

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ టీకా ప్రత్యేక కార్యక్రమాన్ని వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు.

14ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా తప్పనిసరి
గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

  • ముందస్తుగా హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ టీకా పంపిణీ

  • జిల్లాలో 7,103 మంది బాలికల గుర్తింపు

  • జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

గద్వాల న్యూటౌన్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ టీకా ప్రత్యేక కార్యక్రమాన్ని వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెకర్‌ నర్సింగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టీకా కార్యక్ర మం మైక్రోప్లాన్‌ ప్రకారం ప్రతీ పని దినంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌పీవీ టీకా సింగిల్‌ డోస్‌ ఒక్కరికి 0.5 మి.లీ మోతాదు ఇవ్వబడుతుందన్నారు. ప్రతీ టీకా డోస్‌కు పూర్తి బాధ్యత ఉంటుందని, టీకా వృథా కాకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టీకా వేయించే ముందు బాలిక ఖాళీ కడుపుతో ఉండకూడదన్నారు. వయస్సును ఫొటో ఐడీ ద్వారా నిర్ధారించాలని, అలాగే యూ-విన్‌లో ఓటీపీ కోసం తల్లిదండ్రులు, సంరక్షకుల మొబైల్‌ నంబర్‌ అందుబాటులో ఉండాలని సూచించారు. ఇప్పటికే టీకా తీసుకున్నట్లైతే సంబంధిత వివరాలను యూ-విన్‌లో నమోదు చేయాలన్నారు. టీకా అనంతరం 30 నిమిషాలు పరిశీలనలో ఉంచడం తప్పనిసరి అన్నారు. టీకా తీసుకున్న బాలికల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి లైన్‌లిస్ట్‌ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే ద్వారా జిల్లాలో 7,103 మంది 14ఏళ్ల బాలికలను గుర్తించారన్నారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అలంపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న 100 పడకల ఆసుపత్రిలో, అలం పూర్‌ పీహెచ్‌సీలో ఈ వ్యాక్సిన్‌ను వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గద్వాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, స్థానిక కౌన్సిలర్‌ నర్సింహులు, డీఎంహెచ్‌వో సంధ్యాకిరణ్మయి, జిల్లా ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సిద్దప్ప, ఆర్‌ఎంవో హేమలత, వైద్యసిబ్బంది ఉన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 11:12 PM