Share News

విద్యా బోధన సాగేదెలా?

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:45 PM

ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. చాలా మంది ఉద్యోగ విమరణ పొందుతున్నారు.

విద్యా బోధన సాగేదెలా?
జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట ప్రభుత్వ పాఠశాల

- ఫారిన్‌ సర్వీస్‌లో 85 మంది టీచర్లు

- ఎఫ్‌ఎల్‌ఎన్‌ మానిటరింగ్‌ టీంలోనే 100 మంది

- ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. చాలా మంది ఉద్యోగ విమరణ పొందుతున్నారు. వారి స్థానాలు భర్తీ కావడం లేదు. దీంతో ప్రతీ నెల పాఠశాలల్లో ఉపాధ్యాయులు తగ్గిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బడుల్లో బోధించాల్సిన స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి ఉపాధ్యాయులు చాలా మంది ఫారిన్‌ సర్వీస్‌పై డైట్‌, బీఈడీ, మానిటరింగ్‌ టీంలు, డీఈవో కార్యాలయంలో ఉన్న పనులకు వెళ్లారు. దీంతో ఉపాధ్యాయుల కొరత మరింత తీవ్రమవుతుంది. విద్యాశాఖ ఇలాంటి కేటాయింపులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 85 మందికి పైగా టీచర్లు బోధన వదిలి ఇతర పనులపై వెళ్లారు. రెండు నెలలుగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే సెకండరి గ్రేడ్‌ టీచర్లు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులను కలిపి పాఠశాల పర్యవేక్షణ పేరుతో ఎఫ్‌ఎల్‌ఎన్‌ టీంలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100పైగా ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించారు. మహ బూబ్‌నగర్‌ జిల్లాలోనే 33 మంది పైగా టీచర్లను బీఎడ్‌, డైట్‌, డీఈవో కార్యాలయంలో పని చేసేందుకు తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. ఇందులో బీఎడ్‌ కళాశాలకు పది, డైట్‌ కళాశాలకు 12 మంది ఉండగా, మిగిలిన వారు డీఈవో కార్యాలయంలో, మరికొందరు ఆయా మండల విద్యాశాఖ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మ్తొత్తం 223 పైగా టీచర్లు బోదనేతర విధుల్లో కొనసాగుతున్నారు. వారి స్థానాల్లో ఖాళీలు ఏర్పాడ్డాయి.

ఇతర పనులకు వాడుకోవడంపై విమర్శలు

విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులను ఇతర పనులకు ఫారిన్‌ సర్వీస్‌ పై తీసుకోవడం విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని పలువు సీనియర్‌ ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం టీచర్లను పాఠశాలలో బోధనకు పరిమితం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Sep 11 , 2026 | 11:45 PM