Share News

వన్యప్రాణుల దాహం తీరేదెలా?

ABN , Publish Date - May 26 , 2026 | 11:12 PM

తీవ్రమైన ఎండలకు అటవీ ప్రాంతంలో చిన్న నీటి వనరులు ఎండిపోతున్నాయి.

వన్యప్రాణుల దాహం తీరేదెలా?
గాయపడిన గద్దకు చికిత్స చేస్తున్న పశువైద్యులు

- అటవీ ప్రాంతాల్లో తీవ్రమైన తాగునీటి కొరత

- నీటి కోసం గ్రామాలకు వస్తున్న జంతువులు

- కుక్కల దాడిలో గాయపడి మృతి చెందుతున్న ప్రాణులు

వనపర్తి రూరల్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : తీవ్రమైన ఎండలకు అటవీ ప్రాంతంలో చిన్న నీటి వనరులు ఎండిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులు, పక్షులు దాహం తీర్చుకొనే మార్గం లేక అల్లాడుతున్నాయి. వనపర్తి జిల్లాలోని 15 రెవెన్యూ మండలాల్లో, వనపర్తి, కొత్తకోట, అమరచింత, ఘనపూర్‌, గోపాల్‌పేట, పెబ్బేరు, పానగల్‌, రేవల్లి, పెద్దమందడి, వీపనగండ్ల పరిధిలో 10 రిజర్వ్‌ ఫారెస్టు బ్లాకులు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతంలో వేలాదిగా జింకలు, దుప్పిలు, నెమళ్లు, అడవి పందులు, విష సర్పాలు, అడవికోళ్లు, ఉడతలు, పిట్లలు తదితర వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అటవీ ప్రాంతంలోని చిన్న చెరువులు, కుంటలు, గుంతలలో నిల్వ ఉండే నీటితో దాహం తీర్చుకుంటాయి. కానీ వేసవిలో భానుడి ప్రతాపానికి నీటి వనరులు పూర్తిగా ఎండిపోవడంతో తాగునీటి కొరత ఏర్పడింది. దీంతో వన్యప్రాణులు వ్యవసాయ పొలాల్లోని బోరు బావుల వద్దకు వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. ప్రధానంగా జింకలు, దుప్పులు, నక్కలు నీటి కోసం గ్రామాల్లోకి కూడా వస్తుండటంతో వీధి కుక్కలు వాటిపై దాడి చేస్తున్నాయి. దీంతో అవి గాయపడి చనిపోతున్నాయి. కొన్ని సార్లు రోడ్డు దాటుతూ వాహనాల కింద పడి మృతి చెందుతున్నాయి. గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వన్యప్రాణులకు స్థానికుల సాయంతో పశు వైద్యాధికారులు చికిత్స చేస్తున్నారు. కోలుకున్న తర్వాత అడవిలో వదిలేస్తున్నారు. 20 రోజుల కిందట వనపర్తి మండల అంజనగిరి గ్రామ శివారులో ఓ జింక రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని ఓ వాహనం ఢీకొని మృతి చెందింది.

నీటి తొట్లు ఏర్పాటు చేయాలి

కృష్ణసాగర్‌, వన్యప్రాణుల సంరక్షకుడు : అటవీ ప్రాంతాల్లో నీటి వసతి లేకపోవడంతో వన్యప్రాణులకు జనావాసాల్లోకి వస్తున్నాయి. అందుకోసం రోడ్డు దాటుతుండగా వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. జనావాసాల్లోకి వచ్చినప్పుడు వీధి కుక్కలు వాటిపై దాడి చేస్తున్నాయి. గాయపడిన జంతువులకు చికిత్స చేసి అడవిలో వదిలి పెడుతున్నాం. అటవీ ప్రాంతంలో నీటి తొట్లు ఏర్పాటు చేసి వన్యప్రాణుల దాహం తీర్చాలి.

Updated Date - May 26 , 2026 | 11:12 PM