బీమా భరోసా ఎట్లా..?
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:42 PM
కుటుంబంలో రైతు చనిపోతే.. ఆయన కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది.
- ఆగస్టు 15 నాటికే ముగిసిన రైతు బీమా పాలసీ గడువు
- రూ. 1400 కోట్ల మేర ప్రీమియం చెల్లించని ప్రభుత్వం
- ఇందిరమ్మ కుటుంబ బీమా అమలు కోసమే నిలిపివేత
- మార్గదర్శకాలు నిల్... నవంబరులో అమలు అని ప్రచారం
- అప్పటివరకు బాధిత కుటుంబాలకు భరోసా లేనట్లే..
- గత ప్రభుత్వం నుంచే పంటల బీమా పథకానికి మంగళం
నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం బర్కత్ పల్లికి చెందిన రాంచంద్రయ్య (45) ఆగస్టు 29న హఠాన్మరణం చెందారు. అతడు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న రైతు బీమాకు అర్హుడు.. రిజిస్టర్ అయ్యి ఉన్నారు. నామినీగా ఉన్న భార్య మంగమ్మ ఉండగా.. రాంచంద్రయ్య మృతి చెందిన విషయాన్ని గ్రామస్థులు అధికారులకు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరిచినా రైతుబీమా రెన్యువల్ కాకపోవడం వల్ల స్ర్కీనింగ్ చేసే అవకాశం లేదని తెలిపారని కుటుంబీకులు అంటున్నారు. ఎంతో భరోసాగా ఉన్న బీమాను కోల్పోయామని చెబుతున్నారు.
వనపర్తి జిల్లా గోపాల్‌పేటకు చెందిన యాదమ్మ భర్త శివుడు గత నెల 28వ తేదీన మృతి చెం దాడు. ఆయన పేరుపై 25 గుంటల భూమి ఉంది. భర్త మరణించిన తర్వాత యాదమ్మ వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్తే.. రైతు బీమా అందించడం సాధ్యం కాదని చెబుతున్నారు. చాలా పేద కుటుంబం కావడంతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, ఈ పరిస్థితుల్లో వారిని పోషించుకోవడం కష్టమని యాదమ్మ వాపోతోంది. నా భర్త పేరున రైతు బీమా ద్వారా వచ్చే సహాయం అందించాలని, మానవతా దృక్ఫథంతో తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతోంది.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
కుటుంబంలో రైతు చనిపోతే.. ఆయన కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. ప్రతీ సంవత్సరం ప్రభుత్వం రెన్యువల్ ప్రీమియం చెల్లిస్తూ వచ్చింది. ప్రతీ ఏటా కొత్త రైతులను కూడా చేర్చు కుంటూ పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పథకాన్ని కొనసాగించింది. 2026-2027 బడ్జెట్ సందర్భంగా కొత్తగా జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు అం దజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 2 వరకు విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ఎలాంటి జీవోలు విడుదల చేయలేదు. ఆ గస్టు 15 వరకు రైతు బీమా పాలసీ గడువు ఉన్నందున ఆలోపు మార్గదర్శకాలు తయారుచేసి.. రైతులకు ఇబ్బంది కలగకుండా కొత్త పాలసీని అమల్లోకి తీసుకురావాలని భావించింది. కానీ ఆగస్టు పూర్తయినా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమల్లోకి రాలేదు. ఈ పథకం అమల్లోకి వస్తే రైతు బీమా కంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ బీమా ఉన్నా లేకపోయినా ఈ పథకం పరిధిలోకి వస్తారు. కానీ ఎప్పుడు ప్రారంభిస్తారనే స్పష్టత ఇప్పటివరకు రాలేదు. నవంబర్ మూడో వారంలో ప్రారంభిస్తారనే చర్చ జరుగుతోంది కానీ.. విధి విధాలపై నిర్దుష్ట సమావేశాలు ఇప్పటి వరకు జరగలేదు. దీంతో రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. బీమా ఉంటుందా? ఉండదా? అనే సందిగ్ధంలో పడి పోయారు.
మధ్యలో భరోసా లేనట్లే...:
ఏ బీమా పాలసీ అయినా.. గడువులోపు ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేసుకుంటేనే ప్రీమియందారు మరణిస్తే ఆ బీమా సొమ్ము నామినీలకు అందుతుంది. ఆలస్యమైతే ఫైన్ ద్వారా తీసుకుంటారు.. కానీ ఆ మధ్యలో చనిపోతే మాత్రం సొమ్ము రాదు. ఇప్పుడు రైతుభరోసా పరిస్థితి అలాగే ఉంది. కొత్త బీమా పథకం ప్రారంభించక ముందే పాత బీమా పథకాన్ని నిలిపివేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఆరు నెలలకు రెన్యువ ల్ చేసి.. ఇది అమల్లో ఉండగానే కొత్త బీమా పథకాన్ని ప్రారంభిస్తే బాగుండేదని రైతులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బీమా పథకం కింద దాదాపు 42.16 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరూ ఇప్పుడు బీమా పొందే అవకాశం కోల్పోయారు. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1.97లక్షల మంది లబ్ధిదారులు అదనంగా చేరారు. ఒకవేళ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమల్లోకి వస్తే 1.15కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అంటే దాదాపు రైతు బీమా కంటే రెండు రెట్లు ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేది. కేవలం రైతులే కాకుండా వ్యవసాయకూలీలు, ఇతర వృత్తి పనుల వారు, పేదలంతా ఈ స్కీంలో భాగస్వాములు అవుతారు.
పంటల బీమా లేదాయె..!
రైతుబీమా పూర్తి వ్యక్తిగత బీమా పథకం కాగా.. పంటలకు నష్టం జరిగితే అమలు చే సే పంటల బీమా పథకం కూడా ఏళ్లుగా రాష్ట్రంలో అమలు కావడం లేదు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో రైతులే నష్టాన్ని భరించా ల్సి వస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019 -2020 నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం (పీఎంఎఫ్‌బీవై) అమలును నిలిపివేసింది. ఆ తర్వాత నాలుగేళ్లు అమలు చేయలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. కానీ 2024, 2025, 2026 సంవత్సరాల్లో అమలు చేయలేదు. గతేడాది అఽధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం కూడా అందలేదు. ఈ సంవత్సరం ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు సరిగా లేకపోవడంతో పంటలు వేసిన రైతులు వాటిని కాపాడుకోలేక మధ్యలోనే దున్నివేస్తున్నారు. పలు చోట్ల పంటలు ఎండిపోయాయి. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు కురవలేదు. దీనివల్ల దిగుబడి కూడా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 40 శాతం పంటలు ఎండిపోయాయని ఒక అంచనా ఉండగా.. ఎలాగోలా చేతికి వచ్చిన పంటల్లో సైతం దిగుబడి గణ నీయంగా తగ్గిపోయింది. ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్లు దిగుబడి రావాల్సిన పత్తి.. కనీసం 2 నుంచి 4 క్వింటాళ్లు కూడా రాదని రైతులు చెబుతున్నారు. ఈ సమయంలో పంటల బీమా పథకం ఉంటే కొంత సాంత్వన ఉండేదనే అభిప్రా యం రైతుల్లో ఉంది. దీంతో రైతులు అటు వ్యక్తిగత బీమాకు, ఇటు పంటల బీమాకు దూరమైన పరిస్థితులు నెలకొన్నాయి.