పురుడు పోయని దవాఖానాలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:24 PM
గ్రామీణ ప్రాంత గర్భిణులకు స్థానికంగా వైద్యసేవలు అందించడంతో పాటు పురుడు పోయాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫల మవుతున్నాయి.
- లక్ష్యం చేరుకోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
- 5 నెలల లక్ష్యం 2,125 ప్రసవాలు.. జరిగినవి 592
- అదే సమయంలో సీహెచ్‌సీలలో 417 డెలివరీలు
- 5 ఆసుపత్రుల్లో పదికి మించని కాన్పులు
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంత గర్భిణులకు స్థానికంగా వైద్యసేవలు అందించడంతో పాటు పురుడు పోయాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫల మవుతున్నాయి. స్థాఽనిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను పెంచాలని ప్రభుత్వం, అధికారులు పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థా యిలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. అందుకు వైద్యులు, సిబ్బంది కొరత ఒక కారణం కాగా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, లక్ష్యాలను అధిగమించేలా సమావేశాలు, సమీక్షలు లేకపోవడం మరో కారణమని చెప్పవచ్చు.
పాలమూరు జిల్లాలో 17 పీహెచ్‌సీలు
మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 17 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వాటిలో 13 పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేస్తుండగా, 4 పీహెచ్‌సీలు 12 గంటలు పనిచేస్తున్నాయి. ప్రతీ పీహెచ్‌సీలో నెలకు 25 ప్రసవాలు చేయాలనేది లక్ష్యం. ఈ లెక్కన 5 నెలల్లో 2,125 డెలివరీలు చేయాల్సి ఉంది. కానీ ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు అన్ని పీహెచ్‌సీలలో మొత్తం 592 డెలివరీలు మాత్రమే జరిగాయి. 24 గంటల పీహెచ్‌సీలలో మొత్తం 516 డెలివరీలు కాగా, 12 గంటల పీహెచ్‌సీలలో కేవలం 76 కాన్పులు జరిగాయి. జిల్లాలోని ఐదు పీహెచ్‌సీలలో పదుల సంఖ్యలో కూడా డెలివరీలు కావడం లేదు. 24 గంటల పీహెచ్‌సీలలో రాత్రి వేళ వైద్యులు ఉండడం లేదు. నర్సింగ్ సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. వారు కూడా వంతుల వారీగా డ్యూటీలు చేస్తున్నారు. కోత్లాబాద్, పేరూర్, సీసీకుంట, గంగాపూర్, బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్, అడ్డాకుల పీహెచ్‌సీలలో అసలు డెలివరీలే కావ డం లేదు. 12 గంటల పీహెచ్‌సీలలో ఎదిర మి నహా మిగతా వాటిలో నెలకు 20 వరకు డెలి వరీలు అవుతున్నాయి.
రెఫరల్ కేంద్రాలుగా పీహెచ్‌సీలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెఫరల్ కేంద్రాలుగా మారిపోయాయి. పురుడు కోసం పీహెచ్ సీకి వెళితే తమ వద్ద సౌకర్యాలు లేవని, సరైన మందులు లేవని, డాక్టర్లు లేరని అందరినీ జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో అయితే కనీసం చేయిపట్టి కూడా చూడని దుస్థితి నెలకొంది. ఏ చిన్న నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. ఈ 5 నెలల్లో పీహెచ్‌సీల నుంచి దాదాపు 810 కేసులు జనరల్ ఆసుపత్రికి రెఫర్ అయ్యాయి. పీహెచ్‌సీలపై గత కొన్నేళ్లుగా పర్యవేక్షణ పూర్తిగా లోపించిందన్న విమర్శలున్నాయి. వైద్యులు ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత కూడా సమస్యగా మారింది. .
సీహెచ్‌సీలలోనూ ఇదే పరిస్థితి
జిల్లాలోని బాదేపల్లి, కోయిలకొండ కమ్యూ నిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు) రెండు ఉన్నాయి. ఇందులో నెలకు 100 నుంచి 200 వరకు కాన్పులు చేయాల్సి ఉండగా, 100 కూడా దాటడం లేదు. బాదేపల్లి సీహెచ్‌సీలో ఈ 5 నెలల్లో 417 కాన్పులు చేశారు. కానీ కోయిలకొండ సీహెచ్‌సీలో మాత్రం నెలకు 10 కాన్పులు కూడా కావడం లేదు. ఈ 5 నె లల్లో నెలకు 9 చొప్పున కేవలం 44 డెలివ రీలు మాత్రమే చేశారు.
ప్రతీ రోజు తనిఖీలు
ఇకపై ప్రతీ రోజు పీహెచ్‌సీలను తనిఖీ చేస్తాను. ప్రతీ నెల ఎన్ని కాన్పులు అవుతున్నా యి.. జిల్లాకేంద్రంలోని ఆసుపత్రికి ఎందుకు రెఫర్ చేస్తున్నారు.. లక్ష్యాన్ని ఎందుకు చేరుకోవడం లేదన్న అంశాలపై సమీక్ష నిర్వహిస్తాను. లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రణాళిక లు రూపొందించి తగిన చర్యలు తీసుకుంటాం. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తాం.
- డా. శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి, మహబూబ్‌నగర్.