Share News

రంగాలకు పెద్దపీట ఆరోగ్య, సంక్షేమ

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:26 PM

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు.

రంగాలకు పెద్దపీట ఆరోగ్య, సంక్షేమ
నాగర్‌కర్నూల్‌ వైద్యకళాశాలలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను ప్రారంభిస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ

- వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన

- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ

- నాగర్‌కర్నూల్‌లో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, తెలకపల్లిలో పీహెచ్‌సీల ప్రారంభం

నాగర్‌కర్నూల్‌/ తెలకపల్లి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రజలందరికీ కార్పొరేట్‌ తరహా వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, తెలకపల్లిలో పీహెచ్‌సీ భవనాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సైతం ఆరోగ్య సేవలు విస్తరించినప్పుడే పాలక ప్రభుత్వానికి ప్రయోజకత చేకూరుతుందన్నారు. క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌తో విశిష్ఠమైన ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు తదితర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వైద్యులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. పేదలకు వైద్య సేవలందించేందుకు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో 43 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వైద్య కళాశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ఆదరాబాదరాగా తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. ఆయా కళాశాలల్లో వసతిగృహాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు తదితర సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రిలో అవసరమైన వైద్య వసతుల కల్పనకు కలెక్టర్‌ ఖాతాలో రూ. 2.65 కోట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించిన అనంతరం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది డిప్యూటేషన్‌ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జి,పాటిల్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉషారాణి, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ, కమిషనర్‌ సృజన, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ రవీందర్‌నాయక్‌, తెలకపల్లి సర్పంచ్‌ కొమ్ము చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 11:26 PM