రిజర్వేషన్లతో మారిన తలరాతలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:24 PM
కార్పొరేటర్‌గా పోటీ చేయాలన్నది వారి కళ.. ఇందు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు.
- పోటీ నుంచి తప్పుకున్న కీలక నేతలు
- ఎస్సీ, ఎస్టీ సీట్లు తగ్గింపుపై నిరసన
మహబూబ్‌నగర్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేటర్‌గా పోటీ చేయాలన్నది వారి కళ.. ఇందు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. డివిజన్లలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరవయ్యేందుకు లక్షలు ఖర్చు పెట్టుకున్న వారి ఆశలపై రిజర్వేషన్లు నీళ్లు చల్లినట్టైంది. కొందరు పోటీ చేసే అవకాశం కోల్పోగా, మరికొందరికి మాత్రం అనుకూలంగా రిజర్వేషన్లు రావడంతో అప్పుడే కార్పొరేటర్‌గా గెలిచినంత సంతోషంలో తమ ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టారు. పాలమూరు కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా ఎస్సీలకు 5, ఎస్టీకి 2 స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో ఆ సామాజిక వర్గాలలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆదివారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు సీడీఎంఏను కలిసి ఫిర్యాదు చేశారు. తక్కువ జనాభా చూయించి తమకు అన్యాయం చేశారని, వెంటనే తమ వాటా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా న్యూ మోతీనగర్‌లో బీసీ జనాభా ఎక్కువగా ఉండగా అక్కడ బీసీలకు కేటాయించకుండా ఎస్సీలకు కేటాయించారని, వెంటనే బీసీలకు కేటాయించాలని వార్డు ప్రజలు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు సగం స్థానాలు తగ్గించారని నిరసనలు, ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక వరుసగా పలు డివిజన్లలో ఒకే సామాజిక వర్గానికి రిజర్వ్ చేయడంపై ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. చిన్నదర్పల్లి డివిజన్ వరుసగా మూడు పర్యాయాలు ఎస్టీకి రిజర్వ్‌గా, బోయపల్లి వరుసగా మూడు పర్యాయాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కావడంతో అక్కడ రిజర్వేషన్ మార్చాలన్న డిమాండ్ వ్యక్తం అవుతోంది. క్రిష్టియన్‌పల్లిలోనే ఇదే డిమాండ్ వినిపిస్తోంది. మొత్తంగా పాలమూరులో రిజర్వేషన్ కేటాయింపుపై అసంతృప్తి స్వరం వినిపిస్తోంది. కాంగ్రెస్ కేడర్‌లో పలు డివిజన్లలో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమకు వ్యతిరేకంగా రిజర్వేషన్లు వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం రిజర్వేషన్‌న్లు ఖరారైన వెంటనే ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులు డివిజన్లకు చెందిన వాట్సప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నారు. ఫలానా పార్టీ నుంచి పలాన అభ్యర్థి పోటీలో ఉన్నారని, ఫొటోలను షేర్ చే స్తూ మద్దతుదారులు సందడి చేస్తున్నారు. మరి కొందరు బీఫామ్ వచ్చేసిందన్న ప్రచారం చేసుకుంటున్నారు.