Share News

డీసీసీలకు తలనొప్పి..!

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:31 PM

మొన్న జరిగిన పంచాయతీ, నిన్న జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.

డీసీసీలకు తలనొప్పి..!
మహబూబ్‌నగర్‌ డీసీసీ కార్యాలయం

- మునిసిపాలిటీ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం

- ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండని నాయకులు డీసీసీల వద్ద పైరవీలు

- పలుచోట్ల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఇబ్బందులు పడ్డ అధ్యక్షులు

- పరిషత్‌ ఎన్నికల్లో కూడా పార్టీ గుర్తు ఉండటంతో కేడర్‌లో ఆందోళన

- సమన్వయంతో పనిచేయాలని సూచిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం్చ

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మొన్న జరిగిన పంచాయతీ, నిన్న జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. పార్టీ, ప్ర భుత్వ పనితీరుకు గీటురాయిగా భావించిన ప్రతీ ఎన్నికలోనూ మెజారిటీ సాధిస్తుండటంతో కేడర్‌లో కొంత ఉత్సాహం పెరిగింది. కొత్త ఎమ్మె ల్యేలు, రాజకీయ అనుభవం లేనివారు.. పోల్‌ మేనేజ్‌మెంట్‌ తెలియని వారు అని చిన్నచూపు చూసిన ఇతర పార్టీ నాయకులు కూడా వారు చేసిన ఓట్‌ పోలరైజేషన్‌ను హర్షిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ఘ ట్టంలో మిగిలింది పరిషత్‌ ఎన్నికలే.. ఆ తర్వాత పీఏసీఎస్‌లు మినహా అసెంబ్లీ వరకు మరే ప్రత్యక్ష ఎన్నికలు దాదాపు ఉండవని చెప్పవచ్చు. అయితే పరిషత్‌ ఎన్నికలు కొత్త డీసీసీలకు పెద్ద తలనొప్పిగా మారుతాయనే చర్చ నడుస్తోంది. సర్పంచు ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగక పోవడంతో పార్టీ అధ్యక్షులకు పెద్దగా సమస్యలు తలెత్త లేదు.. ఎమ్మెల్యేలే మొత్తం భుజాన వేసుకుని కేడర్‌ను గ్రామాల్లో గెలిపించుకున్నారు. తర్వాత మునిసిపల్‌ ఎన్నికలు రావడం, పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగడంతో సమస్య ప్రారంభమైంది. గత ప్రభుత్వ హయాంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్లుగానే పార్టీ నడిచేది. పార్టీకి అధ్యక్షులు ఉన్నప్పటికీ వారు నామమాత్రులే.. అనేక చోట్ల జిల్లా అధ్యక్ష పదవులను కూడా ఎమ్మెల్యేలే నిర్వ హించారు. అప్పుడు పార్టీ, ప్రభుత్వం ఎమ్మెల్యే కేంద్రంగానే నడిచింది. కానీ కాంగ్రెస్‌ జాతీయ పార్టీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పార్టీని జాతీయ నాయకత్వం కూడా కీలకంగా భావి స్తుంది. ఈ క్రమంలో దాదాపుగా జిల్లా అధ్యక్ష పదవుల విషయంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తగ్గించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో నడపాలని అధిష్ఠానం భావన.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదని చెప్పవచ్చు.

సమన్వయలోపం

ఏ ఎన్నిక వచ్చినా పార్టీ, అధిష్ఠానం చెప్పే ఒకే ఒక్కమాట సర్వేలో ఎవరి పేరు వస్తే వారికే టిక్కెట్లు కేటాయిస్తాం.. కానీ వాస్తవంగా పార్టీలో సమన్వయలోపం కారణంగా ఎమ్మెల్యే టిక్కెట్ల దగ్గర నుంచి సర్పంచు వరకు ముఖ్య నేతల మధ్య వివాదాలే ఉంటున్నాయి. ఎవరి వర్గానికి వారు ప్రాధాన్యం ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమన్వయలోపంతో చాలా గ్రామాలు, కౌన్సిలర్‌/ కార్పొరేటర్‌ స్థానాలు కూడా కోల్పోతున్న పరిస్థితులు గడిచిన రెండు ఎన్నికల్లో కనిపించాయి. పార్టీలో తమ బలం చూపించుకున్న వారు పార్టీ తరపున టిక్కెట్‌ ఇప్పించుకుంటే.. బలం చూపించుకోలేని ముఖ్యనేతలు రెబల్స్‌ను దింపి ఖర్చు చేస్తున్నారు. ఇటీవల ముని సిపాలిటీలో ఇలాంటి పరిణామాలు ఉమ్మడి జిల్లాలో కనిపించాయి. గద్వాల మునిసిపాలిటీలో బీఫాంలు అందజేయడం ఆ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌ రెడ్డికి కత్తిమీద సాము అయ్యింది. ఎమ్మెల్యే వర్గం.. సరిత వర్గం మధ్య విభేదాలతో ఒక దశలో ఎమ్మెల్యే ఎన్నిక కంటే సవాల్‌గా మారింది. సులభంగా గెలవాల్సిన పీఠాన్ని ఎక్స్‌ ఆఫిషియో, స్వతంత్రుల ఓట్లతో చేజిక్కించుకోవాల్సి వచ్చింది. వనపర్తిలో ఎప్పుడూ అటు మేఘారెడ్డి, ఇటు చిన్నారెడ్డి మ ధ్య టిక్కెట్ల విషయంలో కొంత విభేదాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో భారీగా కనిపించగా.. మునిసిపాలిటీ ఎన్నికల్లో డీసీసీ అధ్యక్షుడు శివసేనా రెడ్డి సమన్వయం చేసుకున్నారు. కొంత టిక్కెట్ల కేటాయింపులో వర్గాల మధ్య సందిగ్ధత ఏర్పడినప్పటికీ.. ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌ సాఫీగా సాగింది. నారాయణపేట, నాగర్‌కర్నూలు జిల్లాల్లో పెద్దగా విభేదాలు బయట కు రాలేదు. ఈ రెండు జిల్లాల్లో మంత్రులు ఉండటం ఒక కారణం కాగా.. నారాయణపేటలో రెండు మునిసిపాలిటీలు సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉండటం, ఒక మునిసిపాలిటీ వాకిటి శ్రీహరి పరిధిలో ఉండటంతో వారితో ప్రశాంత్‌రెడ్డి సమన్వయంతో పనిచేసుకుంటూ పోయారు. ఇక మహబూబ్‌నగర్‌ విషయానికి వస్తే టిక్కెట్ల కేటాయింపు వరకు కొంత హడావిడి ఉన్నా.. విభేదాలు పెద్దగా నెలకొనలేదు. కానీ మేయర్‌ ఎన్నిక, ఆ తదనంతర పరిణామాలు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా పరిస్థి తులను మార్చాయి. వర్గాలుగా విడిపోయి మరీ గాంధీభవన్‌కు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు మోసుకున్నట్లు సమాచారం.

పరిషత్‌లో ఎలా?

కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులతో ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు సమన్వ యంతో పనిచేస్తుండగా, కొన్ని జిల్లాల్లో మాత్రం వర్గాలుగా విడిపోయారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వికారాబాద్‌లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పార్టీ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని సూచనలు చేశారు. అయితే కొందరు గత ప్రభుత్వంలో మాదిరి వ్యక్తి కేంద్ర రాజకీయాలు చేస్తుండటంతో తల నొప్పిగా మారుతోందని డీసీసీలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మునిసిపాలిటీ ఎన్నికలు కావడంతో తక్కువ జనాభాతో లింకై ఉంటాయి.. కానీ, పరిషత్‌ ఎన్నికల్లో అలా ఉండదు.. ప్రతీ గ్రామంలో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకంగా ఉంటుంది. పైగా పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో రెబల్స్‌ బెడద కూడా ఎక్కువే.. అలాగే మండలం మొత్తం జడ్పీటీసీ సభ్యుడికి ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో సమన్వయం చేసుకునేదెలా.. ఎవరిని సంప్రదించాలనే విషయంలో కేడర్‌లో గందరగోళం నెలకొంది. ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అయితే పరిషత్‌ ఎన్నికలు ఏప్రిల్‌ చివరిలో లేదా మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉండటంతో అప్పటివరకు నాయకుల మధ్య సమన్వయం చేసేందుకు అధిష్ఠానం ప్రయత్నించాల్సి ఉంది. ఇటీవల సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ పేరిట డీసీసీ అధ్యక్షులను గ్రామాల్లో తిరిగి సంక్షేమ పథకాలు, సమస్యలను తెలుసుకోవాలని పార్టీ ఆదేశించింది. అది కూడా కొంతమేర సమన్వ యానికి ఉపకరించవచ్చు.

Updated Date - Feb 26 , 2026 | 11:31 PM