వచ్చే నెల 2 నుంచి హరీశ్‌రావు పర్యటన
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:37 PM
మాజీ మంత్రి హరీశ్‌రావు నవంబరు 2న ఎండిన వరి పంటలను పరిశీలిస్తారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
- ఎండిన పంటలు పరిశీలించి రైతులతో మాటామంతి
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
పెద్దమందడి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి హరీశ్‌రావు నవంబరు 2న ఎండిన వరి పంటలను పరిశీలిస్తారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం బలిజపల్లి- జంగమాయపల్లి జంట గ్రామాల్లో పామిరెడ్డిపల్లి, చీకురుచెట్టు తండా, ముందరి తండా, అంకురు, వెంకటాపురం, గ్రామాల కార్యకర్తలతో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియ, హరీశ్‌రావు పర్యటనపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో దాదాపు 20 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి చేసి మిగులు కరెంటు రాష్ట్రంగా తయారు చేశారని, కానీ నేటి అసమర్థ ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో బొగ్గు దిగుమతి చేసుకోవడంలో నిర్లక్ష్యం, కృష్ణా జలాలు ఆంధ్ర పాలు చేసి కరెంటు కష్టాలు సృష్టించిందని విమర్శించారు. జూరాల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలానికి 245 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయన, సరైన సమయంలో కేఎల్‌ఐ, నార్లాపూర్ పంపులు ఆన్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా 100 టీఎంసీల నీళ్లు ఆంధ్ర పాలు చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తమ అసమర్థతతను కప్పి పుచ్చుకోవడానికి ఎల్‌నినో అంటూ సాకులు చెబుతుందన్నారు. ఇప్పటికీ శ్రీశైలంలో 60 టీఎంసీల నీటి లభ్యత ఉందని, కేవలం 20 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి ఏదుల వట్టెం, కర్వెన, రిజర్వాయర్లు నింపితే వానాకాలం పంటలు పండి భూగర్భ జలాలు పెరిగి మూగజీవాలకు మంచి నీటి కొరత ఉండదని సూచించారు.
గ్రాడ్యుయేట్ ఓటు నమోదుపై దృష్టి సారించండి
పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవడానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉందని ప్రతీ గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు పట్టభద్రులను స్వయంగా కలిసి ఓటు నమోదు చేయించాలని ఆదేశించారు. అలాగే మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మణిగిళ్ల సర్పంచు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, వేణుయాదవ్, రవిప్రకాష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.