Share News

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:36 PM

జిల్లా కేంద్ర బ్రాహ్మణవాడిలోని శ్రీనివాస కన్యకాపరమేశ్వరి ఆలయంలో నేటి నుంచి ఈనెల 21 వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుద్దేటి శివప్రసాద్‌, కలకొండ రాఘవేంద్ర గుప్త, ప్రధాన అర్చకులు గొండ్యాల రాఘవేంద్రశర్మ పేర్కొన్నారు.

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
మాట్లాడుతున్న పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్ర బ్రాహ్మణవాడిలోని శ్రీనివాస కన్యకాపరమేశ్వరి ఆలయంలో నేటి నుంచి ఈనెల 21 వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుద్దేటి శివప్రసాద్‌, కలకొండ రాఘవేంద్ర గుప్త, ప్రధాన అర్చకులు గొండ్యాల రాఘవేంద్రశర్మ పేర్కొన్నారు. స్థానిక బ్రహ్మణవాడిలోని వాసవీ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు అభిషేకం, కుంకుమార్చన, పల్లకీసేవ నిర్వహిస్తామని తెలిపారు. 11న స్వర్ణకవచాలంకృత ఉమాదేవి, 12న అన్నపూర్ణాదేవి, 13న వైష్ణవిదేవి, 14న వనదుర్గాదేవి, 15న శాకాంబరిదేవి, 16న మహాలక్ష్మిదేవి, 17న సరస్వతీదేవి, 18న మహిషాసుర మర్ధినిదేవి, 19న కనకదుర్గాదేవి, 20న లలితాత్రిపురాసుందరిదేవి, 21 శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవీ రూపంలో అమ్మవారిని అలంకరిస్తామన్నారు. అదే విధంగా ప్రతి రోజు అమ్మవారికి వివిధ వాహనా సేవ ఉంటుందని తెలిపారు. నేటి ఉదయం 8.30 గంటలకు అధ్యక్షుల స్వగృహం నుంచి అమ్మవారి స్వర్ణ ఆభరణములు, పట్టువస్ర్తాలతో ఆలయం వరకు ఊరేగింపు ఉంటుందన్నారు. చివరి రోజు అమ్మవారి వాహన సేవతో వైభవంగా విజయయాత్ర ఉంటుందని, భక్తులు ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. సంఘం కోశాధికారి వలకొండ చంద్రశేఖర్‌, విఠ్యాల రామేశ్వర్‌, రవికుమార్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 11:36 PM