ఘనంగా సద్దుల బతుకమ్మ
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:28 PM
బతుకమ్మ ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి.
మహబూబ్నగర్ న్యూటౌన్, జడ్చర్ల దేవరకద్ర పాలమూరు,అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : బతుకమ్మ ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా అధికారులు ఒక చోట చేరి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ బొడ్డెమ్మలు ఆడారు. పోయిరావే బతుకమ్మా.. అంటూ పాటలు పాడారు. డీఆర్డీవో నర్సింహులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తొమ్మిది రోజులుగా బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కలెక్టరేట్లో అలిగిన బతుకమ్మ సంబురాల వరకు అధికారులు రోజూ బతుకమ్మ ఆడారు. చివరి రోజు అందరూ బాలుర కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఫిషరిష్ ఏడీ రాధారోహిణి పాల్గొన్నారు. జడ్చర్ల పట్టణంలోని వాసవీకన్యకపరమేశ్వరీ ఆలయం, సాయినగర్కాలనీ సకలదేవతల ఆలయంలో బతుకమ్మలను సాంప్రదాయం ఉట్టిపడేలా వివిధ రూపాలతో తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి త్రిశూల్నగర్లోని మినీట్యాంక్బండ్లో నిమజ్జనం చేశారు. దేవరకద్ర మునిసిపల్ కేంద్రంలోని స్థానిక ఈశ్వర వీరప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు దుర్గాదేవికి ఎమ్మెల్యే జీఎంఆర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మునిసిపల్ చైర్పర్సన్ కొండ దమయంతి పాల్గొన్నారు. మహబూబ్నగర్ నగరంలోని బృందావనం కాలనీ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.