చెత్త సేకరించే విషయంలో గొడవ
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:26 PM
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చెత్త వస్తువులు సేకరించడంతో తనకు ఆదాయం తక్కువైతుందని చెప్ప డం, తరుచగా వారితో గొడవ పడటంతో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన కేసును పోలీసులు ఛేదించారు.
- మద్యం మత్తులో బండరాయితో మోది హత్య
- ఇద్దరు నిందితుల అరెస్ట్
- వివరాలను వెల్లడించిన డీఎస్పీ మొగులయ్య
గద్వాల క్రైం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చెత్త వస్తువులు సేకరించడంతో తనకు ఆదాయం తక్కువైతుందని చెప్ప డం, తరుచగా వారితో గొడవ పడటంతో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన కేసును పోలీసులు ఛేదించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌లో హత్యకు సంబంధించి విలేకర్ల సమావేశంలో డీఎస్పీ మొగులయ్య వివరాలు తెలిపారు. ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ కింద కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ మం డలం కడిమెట్ల గ్రామానికి చెందిన గొల్ల వీరేంద్ర(34)ను బండరాయితో హత్య చేసినట్లు ఫిర్యాదు రావడంతో పట్టణ మూడవ ఎస్‌ఐ జహంగీర్ కేసు నమోదు చేశామన్నారు. సీఐ టంగుటూరి.శ్రీను నేరస్థలాన్ని పరిశీలించి వేలిముద్రలను సేకరించడంతో పాటు హత్యకు ఉపయోగించిన బండరాయిని, హత్య అనంతరం మొదటి ముద్దాయి తన రక్తం మరకలు ఉన్న ప్యాంటును ముళ్లపొదల్లో వదిలివేయగా వాటిని స్వాధీనం చేసుకొని పరిశీలించినట్లు వెల్లడించారు. హత్యకు సంబంధించి నిందితుల గురించి ఎలాంటి ఆధారాలు లేనప్పటికి సీసీ పుటేజ్ ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు ప్రత్యేక టీంలతో నిఘా ఉంచగా గురువారం ఉదయం గద్వాల రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం అంబోనిపల్లికి చెందిన కుప్పగిరి శ్రీనివాసులు, ఏపీ రాష్ట్రం కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన సిద్దయ్యలను విచారించగా గొల్ల వీరేంద్రను తామే హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. అయితే వీరిద్దరు ప్రతీ మంగళవారం గద్వాల జములమ్మ ఆలయం పరిసరాల్లో మందుసీసాలు, చెత్త సేకరించడానికి వస్తుంటారు. వీరు ఇద్దరు రావడంతో తన ఆదాయానికి ఇబ్బందిగా ఉందని గొల్ల వీరేంద్ర వీరితో పదే పదే గొడవకు దిగడం, బూతు మాటలు తిట్టడంతో కోపం పెంచు కున్నారు. ఎలాగైన వీరేంద్రను చంపాలని ఈ నెల 11న వీరిద్దరు మద్యం తాగుతుండగా వీరేంద్ర రావడంతో దాడిచేసి బండరాయితో హత్య చేసినట్లు తెలిపారు.