Share News

పన్నుల సొమ్ముతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌!

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:50 AM

ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును మున్సిపల్‌ కార్యాలయంలోని ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి పక్కదారి పట్టించాడు

పన్నుల సొమ్ముతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌!
online betting

  • గద్వాల మున్సిపాలిటీలో

ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి నిర్వాకం

  • రూ.34 లక్షలు దాకా

పోగొట్టుకున్నట్టు సమాచారం

  • అధికారులు డబ్బు అడుగుతారని ఆత్మహత్యాయత్నం

గద్వాల క్రైం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును మున్సిపల్‌ కార్యాలయంలోని ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి పక్కదారి పట్టించాడు. పన్నుల సొమ్ముతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.34 లక్షల దాకా పోగొట్టుకున్నాడు. ఉన్నతాధికారులు ఆ డబ్బు అడుగుతారనే భయంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గద్వాల మునిసిపల్‌ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. మునిసిపల్‌ కార్యాలయానికి సంబంధించి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులో నుంచి రూ.34 లక్షలను ఆ ఉద్యోగి బెట్టింగ్‌లకు ఉపయోగించినట్లు తెలిసింది. ఆ డబ్బు పోవడం, తిరిగి ఎలా చెల్లించాలో తెలియక ఆ కాంట్రాక్టు ఉద్యోగి గురువారం తెల్లవారుజామున పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా, సదరు ఉద్యోగి తన దగ్గర ఉన్న డబ్బులతో పాటు ఇతర వ్యక్తుల వద్ద ఆప్పులు చేసి మరీ బెట్టింగ్‌లకు పాల్పడేవాడని, అప్పులపాలైతే గతంలో కుటుంబసభ్యులు వాటిని తీర్చారని సమాచారం. అలాగే, మున్సిపల్‌ పరిధిలో వసూలు చేసిన పన్నులను కూడా గతంలోనూ బెట్టింగ్‌లకు ఉపయోగించినట్టు చెబుతున్నారు. ఆ డబ్బును కుటుంబసభ్యులే తిరిగి మున్సిపాలిటీకి జమ చేసినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఓ సారి ఆత్మహత్యకు యత్నించినట్టు చెబుతున్నారు. కాగా, ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ జానకిరామ్‌సాగర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. సదరు ఉద్యోగి దాదాపు రూ. 10 లక్షలకు పైగానే వాడుకున్నట్లు తెలుస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు సిబ్బందికి మెమోలు ఇచ్చామని, సదరు ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Updated Date - Sep 25 , 2026 | 02:04 AM