ఆయిల్ పామ్ సాగుకు పూర్తి సహకారం
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:43 PM
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు రైతులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహాకారాలు అందుతాయని కలెక్టర్ ఖుష్భూ గుప్తా పేర్కొన్నారు.
కలెక్టర్ ఖుష్భూ గుప్తా
భూత్పూర్, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆయిల్ పామ్ సాగు రైతులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహాకారాలు అందుతాయని కలెక్టర్ ఖుష్భూ గుప్తా పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తాటికొండ రైతు వేదికలో ప్రి-యూనిక్ కంపెని ఆధ్వర్యంలో 100వ ఆయిల్ పామ్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఖుష్భూ గుప్తా సాగు చేస్తున్న రైతులకు అన్ని విధాలా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. అంతకుముందు జిల్లా ఉద్యాన వన శాఖ అధికారులు ఆయిల్ పామ్ తోటల సాగు గురించి వివరించారు. జిల్లాలో 5 వేల ఎకరాల్లో సాగు చేసే సామర్థ్యం ఉండగా ఇప్పటి వరకు 4800 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటలను సాగు చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. ప్రస్థుత లక్ష్యం (2026-27) ఆర్థిక సంవత్సరానికి 1500 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, పరిపాలన అనుమతులతో 1080 ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రస్థుతం 210 ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పూర్తైనట్లు ఉద్యానవన అధికారులు తెలిపారు. ప్రి-యూనిక్ కంపెని ఎండీ డి.ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో త్వరలో కస్టమ్ హియరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, నైపుణ్యం ఉన్న కూలీలు, సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నెటాఫిమ్ డ్రిఫ్ అగ్రోనమిస్ట్ సుబ్బారావు ఆయిల్ పామ్ సాగులో యాజమాన్య పద్దతులు, సూక్ష్మ నీటి పారుదల (డ్రిఫ్) నిర్వహణపై అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ సాగులో నాలుగేళ్లు దాటిన రైతులకు డబుల్ ల్యాటరల్ డ్రిప్ లైన్లు అందించాలని, ఆయిల్ పామ్ గెలలు కోయడానికి మోటారైజ్ చిజెల్ యంత్రాలు సమకూర్చాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. సర్పంచ్ కల్పనారెడ్డి, తహసీల్దార్ కిషన్, ఎంపీడీవో ఉమాదేవి పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ ఖుష్బూగుప్తా పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గో గ్రీన్-సేవ్ ఎన్విరాస్‌మెంట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలెక్టర్‌ను కలిసి, గో గ్రీన్-సేవ్ ఎన్విరాస్‌మెంట్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ హిత వినాయక చవితిని నిర్వహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని, కలెక్టరేట్ ఏవో సువర్ణరాజ్, ట్రస్మా అధ్యక్షుడు ప్రభాకర్‌జీ, చందుయాదవ్, ప్రచార కార్యక్రమ సమన్వయకర్త రాకేష్, కాంగ్రెస్ నాయకులు వినయ్, రాజేష్, దామోదర్, సతీష్ పాల్గొన్నారు.