Share News

నాలుగు మునిసిపాలిటీలు.. 525 నామినేషన్లు

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:04 AM

జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మునిసిపాలిటీల్లో పుర ఎన్నికలకు సంబంధించి వచ్చేనెల 11న జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది.

నాలుగు మునిసిపాలిటీలు.. 525 నామినేషన్లు
గద్వాల మునిసిపల్‌ కార్యాలయం ఎదుట పోలీసు బందోబస్తు

  • జోగుళాంబ గద్వాల జిల్లాలో అట్టహాసంగా మునిసిపల్‌ నామినేషన్ల దాఖలు

  • గద్వాలలో 306- అయిజ 103 - వడ్డేపల్లి 57 - అలంపూర్‌ 59

గద్వాల క్రైం/గద్వాల టౌన్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మునిసిపాలిటీల్లో పుర ఎన్నికలకు సంబంధించి వచ్చేనెల 11న జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. చివరిరోజు పెద్దమొత్తం నామినేషన్ల ప్రక్రియ పోలీస్‌ బందోబస్తు మధ్య సజావుగా ముగిసిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రం గద్వాలలో చివరిరోజు శుక్రవారం అభ్యర్థులు 245 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు స్థానిక రాఘవేంద్రకాలనీ నుంచి ర్యాలీతో తరలిరాగా, బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులు సైతం ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఏఐఎంఐఎం చెందిన ఐదుగురు అ భ్యర్థులు, సీపీఐకి చెందిన ఒకరు చివరిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మొత్తం 37 వార్డుల నుంచి నామినేషన్‌ వేశారు. అదే పార్టీ పేరుతో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించడం విశేషం. పలువురు పార్టీ పేరుతో పాటు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. మొత్తం 37వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య 270కి చేరింది. తొలిరోజు ఒకే నామినేషన్‌ దాఖలు కాగా, రెండోరోజు 60 నామినేషన్లు రాగా, చివరిరోజు ఆ సంఖ్య 245కు చేరింది. దీంతో గద్వాల మునిసిపాలిటీలో మొత్తం 306 నామినేషన్లు దాఖలయ్యాయి.

  • అయిజ మునిసిపాలిటీలో మూడోరోజు కాంగ్రెస్‌ నుంచి 25, బీఆర్‌ఎస్‌ నుంచి 32, బీజేపీ నుంచి 13, బీఎస్‌పీ 4, డీఎస్‌పీ ఒకటి, ఇండిపెండెంట్‌ 3 మొత్తం 78 మంది నామినేషన్లు వేశారు. మొదటి రోజు ఒకటి, రెండో రోజు 24, మూడో రోజు 78 కలిపి మొత్తం 103 నామినేషన్లు అందాయని అధికారులు తెలిపారు. అయిజలో పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్‌ 32, బీఆర్‌ఎస్‌ 43, బీజేపీ 19, బీఎస్‌పీ 4, ఇండిపెండెంట్‌ 3, డీఎస్‌పీ ఒకటి, జనసేన ఒక నామినేషన్‌ వేశారు.

  • వడ్డేపల్లి మునిసిపాలిటీలో శుక్రవారం 34 నామినేషన్లు దాఖలయ్యాయని మునిసిపల్‌ కమిషనర్‌ రాజయ్య తెలిపారు. ఏఐఎంఐఎం నుంచి ఒకరు, బీజేపీ నుంచి 11 మంది, కాంగ్రెస్‌ నుంచి 14 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 14, ఇతర రాష్ర్టాల నుంచి గుర్తింపు పొందిన పార్టీలు, ఇతర పార్టీల నుంచి 15మంది అభ్యర్థులు, స్వతంత్రులు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా రెండోరోజు 23 నామినేషన్లు, మూడోరోజు 30న శుక్రవారం 34, మొత్తం 57 నామినేషన్లు దాఖలయ్యాయని కమిషనర్‌ తెలిపారు.

  • అలంపూర్‌ మునిసిపాలిటీలో మొత్తం 59 నామినేషన్లు దాఖలు చేశారని మునిసిపల్‌ కమిషనర్‌ శంకర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ నుంచి 16, బీజేపీ నుంచి 10, కాంగ్రెస్‌ నుంచి 21, బీఎస్పీ నుంచి 1, సీపీఎం 1, జనసేన నుంచి 2, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 8 నామినేషన్లు దాఖలయ్యాని తెలిపారు.

Updated Date - Jan 31 , 2026 | 12:04 AM