Share News

శాశ్వత నిర్మాణాలపై ఫోకస్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:59 PM

గ్రామాల్లో శాశ్వత భవనాల నిర్మాణాలకు వీబీజీరామ్‌జీ పథకం ఆశాజనకంగా మారింది.

శాశ్వత నిర్మాణాలపై ఫోకస్‌
హన్వాడ మండలం నాయినోనిపల్లిలో ప్రారంభానికి ిసిద్ధమైన గ్రామపంచాయతీ భవనం

- వీబీజీరామ్‌జీ నిధులతో పుంజుకుంటున్న పనులు

- ‘ఉపాధి హామీ’లో రూ.16 కోట్ల బిల్లులు పెండింగ్‌

- ప్రస్తుతం ఎప్పటికప్పుడు విడుదలవుతున్న నిధులు

- వేగంగా కొనసాగుతున్న భవనాల నిర్మాణం

మహబూబ్‌నగర్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో శాశ్వత భవనాల నిర్మాణాలకు వీబీజీరామ్‌జీ పథకం ఆశాజనకంగా మారింది. ఈ పథకం ద్వారా ప్రజలకు ఉపయోగపడే గ్రా మ పంచాయతీ, అంగన్‌వాడీ, మహిళా సమా ఖ్య భవనాలతో పాటు, గిడ్డంగులను నిర్మిస్తున్నారు. అయితే జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా)లో చేసిన పనులకు బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ముందుకు రాక, మరికొన్ని చోట్ల స్థలాల కొరతతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు నిధుల కొరతతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మూడు నెలల క్రితం ఉపాధి హామీ స్థానంలో వీబీజీరామ్‌జీ పథకాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి నిధులు వెంటవెంటనే మంజూరవుతున్నాయి. పనులు చేసిన తర్వాత బిల్లులను సిద్ధం చేసి పంపిస్తే, వారం రోజుల్లో మంజూరవుతున్నాయని అధికారులు చెప్తున్నారు.

పెండింగ్‌ బిల్లులు విడుదలైతేనే..

ఉపాధి హామీ పథకం ఉన్న సమయంలో చేసిన పనులను ఇప్పటికీ బిల్లులు రాకపోవడం తో చాలామంది కాంట్రాక్టర్లు భవన నిర్మాణ పనులను నిలిపివేశారు. ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తుండగా, బిల్లులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పనులకు సంబంధించి రూ.16 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో గ్రామాల్లో భవన నిర్మాణ పనులను చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పలు చోట్ల ముగ్గురు, నలుగురు మేస్త్రీలకు పనులు అప్పగిస్తున్నా, బిల్లుల రాక ఆలస్యం కావడంతో పనులు ముందుకు సాగడం లేదు. పెండింగ్‌ బిల్లులు విడుదల చేస్తే నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోనుంది.

అసంపూర్తిగా భవన నిర్మాణాలు

జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించారు. 191 భవనాలకు నిధులు మంజూరు కాగా, ఇందులో 102 భవన నిర్మాణాలు పూర్తయ్యా యి. 46 భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఏడింటికి స్థలాలు దొరకడం లేదు. మిగతా 36 భవనాల నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది. అదేవిధంగా 36 అంగన్‌వాడీ భవనాలకు రూ.12 లక్షల చొప్పున మంజూరు చేశారు. వాటిలో 33 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా, 3 భవనాల పనులు ప్రా రంభం కాలేదు. జిల్లాలో గ్రామ మహిళా సమాఖ్యలకు 274 భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ.10 లక్షలు కేటాయించగా, ప్రస్తుతం 13 మాత్రం పూర్తి కాగా, 193 భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మరో 64 భవనాలను ప్రారంభించలేదు. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మండలానికి ఒక గిడ్డంగిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి, రూ. 30 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. ప్రస్తుతం వాటిలో 13 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా గతంలో పనులు నత్తనడకన సాగాయని, ఇప్పుడు నిధులకు కొరత లేదని అధికారులు చెప్తున్నారు.

చేసిన పనులకు వెంటనే బిల్లులు

వీబీజీరామ్‌జీ పథకంలో నిధులకు ఇబ్బంది లేదు. చేసిన పనులకు ఎంబీ రికార్డ్‌ చేసి పంపిస్తే వారం రోజుల్లోనే బిల్లులు వ స్తున్నాయి. గతంలో నరేగాలో చేపట్టిన పనులకు కూడా త్వరలోనే బిల్లులు మంజూరవుతాయి. ప్రస్తుతం చాలా చోట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. నిఽధుల సమస్య లేకపోవడంతో పనులు సకాలంలో పూర్తయ్యే లా చర్యలు తీసుకుంటున్నాం.

- మల్లయ్య, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌ శాఖ

Updated Date - Nov 06 , 2026 | 11:59 PM