Share News

చేరికలపై ఫోకస్‌!

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:25 PM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకత్వంపై ఫోకస్‌ పెట్టారు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు దక్కక, ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతున్న వారిని తనతో కలుపుకుని పోయేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

చేరికలపై ఫోకస్‌!
గద్వాలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న రంజిత్‌కుమార్‌ (ఫైల్‌)

- ఉమ్మడి పాలమూరు నాయకత్వంపై కల్వకుంట్ల కవిత దృష్టి

- పార్టీ ప్రకటించే నాటికే ఎక్కువ మంది చేరేలా ప్రణాళికలు

- ప్రజాబలం ఉన్న వారిని మొదటి దశలో చేర్చుకునేందుకు ఆసక్తి

- ఇప్పటికే జనంబాట, రైతు సదస్సులతో పర్యటనలు

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకత్వంపై ఫోకస్‌ పెట్టారు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు దక్కక, ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతున్న వారిని తనతో కలుపుకుని పోయేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఆయా పార్టీల్లో బలంగా ఉన్న రెండో కేడర్‌ను పార్టీ ఏర్పాటుకు ముందే చేర్చుకోవాలని యోచిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయిన తర్వాత కవిత తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలను విస్తృతం చేశారు. అన్ని జిల్లాల్లో జాగృతి జనంబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా జిల్లాల్లో మేధావులు, ప్రజాసంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. పాలమూరులో కూడా పర్యటించిన ఆమె ప్రాజెక్టులను సందర్శించారు. కుమ్మెర ఘటన సమయంలోనూ నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించి, బాధితులకు భరోసా ఇచ్చారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఈ నెల 25వ తేదీన తన నూతన పార్టీ, రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పిన కవిత, ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ రోజు చేరికలు ఉండవని ఇప్పటికే ప్రకటించగా, మేడ్చల్‌ జిల్లాలో నిర్వహించే సభ కంటే ముందే మెజారిటీ కీలక నాయకులను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల, అలంపూర్‌, దేవరకద్ర, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు ఇప్పటికే ఆమెతో టచ్‌లో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న పార్టీ నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉండటంతో పేర్లు బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు. పార్టీ పెట్టిన తర్వాత చేరుదామనే భావనలో మరి కొందరు ఉన్నారు. ప్రస్తుతం ఆయా పార్టీల్లోని కీలక నాయకులు ఎవరూ చేరకపోయినప్పటికీ నియోజకవర్గాల పెంపు ఆశతో రెండో కేడర్‌ మాత్రం ముందే వేదికను వెతుక్కోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో స్వతంత్రులు, అప్రధాన్య పార్టీల నుంచి పోటీ చేసిన వారు, పలుమార్లు టిక్కెట్లు, పదవులు ఆశించి భంగపడ్డ వారి పునరేకీకరణ ప్రస్తుతం జరుగుతోంది.

మొదటి దశలో ఫౌండర్‌ మెంబర్లు

పార్టీ ఏర్పాటు.. వచ్చే ఎన్నికల నాటికి విస్తరణ చేసి పోటీలో నిలవాలని భావిస్తున్న జాగృతి అధినేత.. పునాదులు బలంగా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే పార్టీ ప్రకటనపై సమయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. పార్టీలో నేతలు ఏర్పాటు తర్వాతే అని కవిత అంటుండగా.. కేడర్‌ బలంగా ఉండేలా మొదటి దశలో చేర్చుకునే వారిని ఫౌండర్‌ మెంబర్లుగా నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. వారిని కోర్‌ టీమ్‌లో ఉంచుకుని.. ఆయా జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళిక చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, దేవరకద్ర, గద్వాల, అలంపూర్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో కొంతమంది నేతలతో ఇప్పటికే ఆమె మాట్లాడుతున్నట్లు సమాచారం. జాగృతి ఏర్పాటు నుంచి టచ్‌లో ఉన్నవారిని కూడా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉండటంతో పార్టీని వేగంగా ప్రజల్లోకి తీసుకుపోవడం పెద్దకష్టం కాదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో జనంబాట కార్యక్రమం తర్వాత గద్వాల జిల్లాలో రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమం కూడా చేశారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో పోటీచేసిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ గొంగళ్ల రంజిత్‌కుమార్‌ కవిత వెంట పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. రైతు ధర్నా కూడా ఆయన నేతృత్వంలో నిర్వహించారు. అయితే బుధవారం ఆయన తన కార్యాలయంలో ముఖ్య నాయకులు, అనుచరులతో భేటీ నిర్వహించి.. కల్వకుంట్ల కవిత నూతనంగా పెట్టే పార్టీలో జాయిన్‌ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సభ కంటే ముందే ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లో కవిత సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ కూడా ప్రధాన పార్టీ అభ్యర్థిత్వం లేకపోయినా గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తర్వాత అత్యధిక ఓట్లు సాధించారు. సీడ్‌ పత్తిరైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారు.

పాలమూరు ఎజెండా

జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రతీ జిల్లాలో పర్యటించిన ఆమె.. ఆయా జిల్లాల వారీగా ఎజెండా రూపకల్పన చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పెండింగ్‌ ప్రాజెక్టులు, కృష్ణా జలాల వినియోగం, వెనుకబాటుతనం, అక్షరాస్యత, కుల వివక్ష తదితర అంశాలను తన ఎజెండాలో పొందుపర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల వారీగా రూపొందించిన ఎజెండా ఆధారంగా పార్టీ ఏర్పాటు తర్వాత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది.

Updated Date - Apr 02 , 2026 | 11:25 PM