Share News

కదలని దస్త్రం

ABN , Publish Date - Apr 25 , 2026 | 10:43 PM

రాష్ట్రంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ దశాబ్దకాలంగా రైతులను ఊరిస్తూనే ఉంది. దరఖాస్తులు స్వీకరించి ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. ప్రతీసారి ఊరించి.. ఉసూరుమనిపించినట్లుగా పరిస్థితి తయారవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కదలని దస్త్రం
దుక్కి దున్నుతున్న రైతు(ఫైల్‌)

సాదాబైనామానాల క్రమబద్ధీకరణకు హైకోర్టులో ఊరట

రోజులు గడస్తున్నా ప్రక్రియను ప్రారంభించని అధికారులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 29,375 దరఖాస్తుల పెండింగ్‌

2016 నుంచి దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న పరిస్థితి

క్రమబద్ధీకరణ కాకపోవడంతో పథకాల లబ్ధికి రైతులు దూరం

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ దశాబ్దకాలంగా రైతులను ఊరిస్తూనే ఉంది. దరఖాస్తులు స్వీకరించి ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. ప్రతీసారి ఊరించి.. ఉసూరుమనిపించినట్లుగా పరిస్థితి తయారవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ధరణి సమయంలో, ప్రస్తుతం భూభారతి సమయంలోనూ పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇన్నాళ్లు కోర్టులో స్టే ఉండటంతో క్రమబద్ధీకరణకు అడ్డంకి ఉండగా.. ఇటీవల హైకోర్టు ప్రక్రియను చేపట్టడానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు సాదాబైనామాల దస్ర్తాలను కదల్చడం లేదు. ఈ కారణంగా రైతు భరోసా, రైతు బీమా, సబ్సిడీ పథకాలు, పండిన పంటలను విక్రయించుకోవడం.. ఫర్టిలైజర్‌ యాప్‌ ద్వారా ఎరువులు బుక్‌ చేసుకోవడం వరకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ధరణి ప్రవేశపెట్టిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదాబైనామాలను ముందుకు తీసుకువచ్చి, క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత కొం దరు హైకోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి లో ఉన్న లోపాలను స రిదిద్ది.. భూభారతిని ప్ర వేశపెట్టింది. ఇందులో సాదాబైనామాల క్రమబద్ధీకరణ జరుగుతుందని ప్రకటించారు. భూభారతిలో సెక్షన్‌-6 రూ ల్‌(6)లో స్పష్టంగా ఆప్షన్‌ ఇచ్చారు. దీంతో రై తుల్లో ఆశలు చిగురించాయి. ఆర్డీఓల నేతృత్వంలో దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కాగా, కొన్ని సమస్యలతో మళ్లీ నిలిచిపోయింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నాన్చుడు ధోరణి కనిపిస్తోంది.

ఏంటీ సాదాబైనామాలు..

ప్రస్తుతం ఆస్తి కొనుగోలు, అమ్మకాలు రిజిస్ర్టేషన్‌ పద్ధతి ద్వారానే కొనసాగుతున్నాయి. గ తంలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ భూముల విషయంలో రిజిస్ర్టేషన్‌ పద్ధతిని ఎక్కువగా వినియోగించేవారు కాదు. ఆస్తి కొనుగోలు చేసినప్పుడు తెల్లకాగితం లేదా బాండ్‌ పేపర్‌పై క్రయావిక్రయాలు చేసుకునేవారు. రిజిస్ర్టేషన్‌ చేసుకోనందున ఆ భూములు మ్యూటేషన్‌ కావడం కష్టంగా మారింది. గతంలో సాదాబైనామాలను కొనుగోలు, అమ్మకందారుల పరస్పర అంగీకారంతో మ్యూటేషన్‌ చేసేవారు. అయితే నిబంధనలు కఠినతరం కావడంతో అవి మ్యూటేషన్‌ కాలేదు. ఏళ్లుగా మ్యూటేషన్‌ కాకపోవడం వల్ల భూముల ధరలు పెరగడం, ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తడం వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ధరణి ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం 2016లో జీఓ నెంబర్‌ 153ను తీసుకువచ్చింది. 2014 జూన్‌ 2వ తేదీ అంటే రాష్ట్ర ఆవిర్భావానికంటే ముందు సాదాబైనామాలతో భూమి కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. తర్వాత మళ్లీ 2020 అక్టోబరు 12న కూడా జీఓ నెంబరు 112ను జారీ చేసింది. సమస్య పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగానే 2020లో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. సాదాబైనామాలు క్రమబద్దీకరణ కాకపోవడం, ఆస్తి మ్యూటేషన్‌ కాకపోవడంతో పాత పట్టాదారుల పేరుపైనే పుస్తకాలు అందాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతిలో నిబంధన ఇచ్చినా కోర్టు స్టే కారణంగా మోక్షం లభించలేదు. అయితే ఇటీవల కోర్టు తీర్పు సానుకూలంగా వచ్చినా ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.

29,375 దరఖాస్తులు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతు భరోసా కోసం చేసిన సర్వేలో సుమారు 24.71 లక్షల సాగుయోగ్యమైన భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇందులో కొన్ని భూములు నిషేధిత జాబితాలో ఉండగా.. కొన్ని భూములు వివాదాస్పద జాబితా(పార్ట్‌-బీ)లో ఉన్నాయి. పార్ట్‌ బీ దరఖాస్తులను భూభారతిలో భాగంగా పరిష్కారం చేస్తున్నారు. అత్యధికంగా నాగర్‌కర్నూలు జిల్లాలో 7.39 లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉంది. అయితే 2014 జూన్‌ 2కు ముందు సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారు సుమారు 29,375 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో కూడా అత్యధికంగా నాగర్‌కర్నూలు జిల్లా నుంచి 8,536 దరఖాస్తులు ఉండగా.. ఆ తర్వాత వనపర్తిలో 7,843 దరఖాస్తులు ఉన్నాయి. నారాయణపేటలో 6,390 మంది, మహబూబ్‌నగర్‌లో 4,500 మంది, గద్వాలలో 2,106 మంది రైతులు క్రమబద్దీకరణ కోసం భూభారతికి ముందు దరఖాస్తు చేసుకున్నారు. భూభారతి వచ్చిన తర్వాత కూడా దరఖాస్తులు చేసుకున్నవారు వీటికి అదనం. అయితే ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉన్నందున సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో పాటు భూమి చుట్టుపక్కల ఉన్నవారి విచారణతో దరఖాస్తులను పరిశీలించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 25 , 2026 | 10:43 PM