Share News

స్మార్ట్‌లో ఫస్ట్‌

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:22 PM

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో నారాయణపేట జిల్లా ముందంజలో ఉంది. ఈనెల 17వ తేదీ నాటికి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

స్మార్ట్‌లో ఫస్ట్‌
నారాయణపేటలో లబ్ధిదారుకు స్మార్ట్‌ రేషన్‌కార్డును అందిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్‌ ప్రియాంక (ఫైల్‌)

- రేషన్‌కార్డుల పంపిణీలో నారాయణపేట ముందంజ

- 99.44 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

నారాయణపేట, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో నారాయణపేట జిల్లా ముందంజలో ఉంది. ఈనెల 17వ తేదీ నాటికి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీకి గత ఆగస్టు 15న శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్‌హాల్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కొండ శ్వేతా సత్యాయాదవ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల జీఅర్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ వినీత్‌, డీఎస్‌వో బాల్‌ రోజుల చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు.

1.71లక్షల స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 1,72,339 మంది లబ్ధిదారులుండగా, ఇప్పటి వరకు 1,71,117 మందికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఇంకా 952 స్మార్ట్‌ కార్డులను లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. దీంతో 99.44 శాతం స్మార్ట్‌ కార్డుల పంపిణీతో రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో మహబూబాబాద్‌, తృతీయ స్థానంలో సిద్ధిపేట ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఉమ్మడి మహబుబ్‌నగర్‌ జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 1,90,972కు గాను, 1,71,716 (89.92 శాతం)కార్డులను పంపిణీ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2,79,528కు గాను 1,76,071 (65.62 శాతం) కార్డులను లబ్ధిదారులకు అందించారు. మహబుబ్‌నగర్‌ జిల్లాలో 2,82,249 మంది లబ్ధిదారులుండగా, 27069 (9.59 శాతం) కార్డులను పంపిణీ చేశారు. వనపర్తి జిల్లాలో 1,84,007 రేషన్‌ స్మార్ట్‌ కార్డులకు గాను 1,606 (0.87శాతం) కార్డులను మాత్రమే లబ్ధిదారులకు అందించారు.

సమష్టి కృషితో సత్ఫలితాలు

జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌ ప్రీయాంక అధ్వర్యంలో గత ఆగస్టు 15న స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టాము. తహసీల్దారుల నేతృత్వంలో లబ్ధిదారులకు కార్డులను అందిస్తున్నాం. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించి, రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

- బాల్‌రాజ్‌, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి, నారాయణపేట.

Updated Date - Oct 23 , 2026 | 11:22 PM