కోదండాపురంలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:42 PM
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని కోదండాపురం గ్రామంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
- దగ్ధమైన రెండు గుడిసెలు
- రూ.40 వేలతో పాటు తులం బంగారం, 50 తులాల వెండి అగ్నికి ఆహుతి
ఎర్రవల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని కోదండాపురం గ్రామంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నివాసముంటున్న రెండు గుడిసెలు కాలి దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. కూలీ చేసుకుని జీవనం సాగిస్తూ రెండు పూరి గుడిసెల్లో నివాసముంటున్న జంగం పరుశరాముడు, దిన్నెరాముడుల కుటుంబాలు రోజు మాదిరిగా పొలం పనులకు వారి గుడిసెలకు తాళాలు వేసి వెళ్లిపోయారు. సరిగ్గా మధ్యాహ్నం 12గంటల సమయంలో ప్రమాదవశాత్తు జంగం పరుశరాముడు గుడిసెకు నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. ఇంట్లో ఉన్న ఫ్రిజ్ సైతం పేలడంతో మంటలు మరింత ఉధృతం అయ్యాయి. దీంతో పక్కనే ఉన్న దిన్నె రాముడు గుడిసెకు మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు ఇరుగుపొరుగు వారి సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ జంగం పరుశరాముడు గుడిసె మంటల్లో పూర్తిగా చిక్కుకుంది. దీంతో గుడిసెలో ఉన్న టీవీ, ఫ్రిజ్, బియ్యం, బ్యాళ్లు, బట్టలు, రూ.40వేల నగదు, తులం బంగారం, 50తులాల వెండి కూడా మంటల్లో కాలిపోయినట్లు తెలిపారు. దిన్నె రాముడు గుడిసెలో మాత్రం నిత్యావసరాలతో పాటు టీవీ కాలిపోయింది. కోదండాపురం ఎస్‌ఐ తరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. తహసీల్దార్ నరేష్ కూడా వెళ్లి విచారించి, పంచనామా చేశారు.