వెరవని కీచకులు!
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:36 PM
నేరస్తులకు కోర్టులు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా, వాటిని ఖాతరు చేయడం లేదు. కీచకులు లైంగిక నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు.
- శిక్షలు పడుతున్నా ఆగని నేరాలు
- బాలికలపై పెచ్చుమీరుతున్న లైంగికదాడులు
- నిందితులపై పోక్సో కేసు నమోదు
- పాలమూరులో రెండ్రోజుల్లో ముగ్గురికి జైలుశిక్ష
- కఠిన శిక్షలు అమలవుతున్నా మారని తీరు
- కేసులను ఎదుర్కొంటున్న పలువురు గురువులు
మహబూబ్‌నగర్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): నేరస్తులకు కోర్టులు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా, వాటిని ఖాతరు చేయడం లేదు. కీచకులు లైంగిక నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులు.. కొందరు వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. చట్టాల గురించి సరైన అవగాహన లేని నిరక్షరాస్యులు లైంగిక వేధింపులతో పోక్సో(ప్రొటెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్యువల్ అఫెన్సెస్) కేసులను ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లు, నాలుగేళ్ల చిన్నారులపైనా అత్యాచార యత్నాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేస్తోంది. పోక్సో చట్టంపై పాఠశాల దశలోనే పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ కేసు నమోదైతే బెయిల్ రాదన్న విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
రెండ్రోజుల్లో ముగ్గురికి కఠినశిక్ష
పోక్సో కేసుల్లో ఉన్న తీవ్రతను బట్టి ప్రత్యేక కోర్టుల్లో విచారణ చేస్తారు. నిందితులకు త్వరగా శిక్ష పడేందుకు ఈ కోర్టుల ద్వారా దర్యాప్తు వేగవంతంగా సాగుతుంది. పాలమూరులో ఈనెల 2, 3 తేదీల్లో రెండ్రోజుల వ్యవధిలో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7/5/2023న ఆరేళ్ల చిన్నారిపై వారణాసి రాములు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్చు ఇచ్చారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదే రోజు జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో 14 ఏళ్ల బాలికను ఎండీ సలీం అపహరించి కర్నూల్, తిరుపతికి తీసుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. వీటితో పాటు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరన్నపేటకు చెందిన ఎర్ర సురేశ్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో నిందితుడికి ఏడాది జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. పోలీసులు పారదర్శకంగా విచారణ జరిపించి సరైన సాక్షాధారాలతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేస్తే నిందితులకు తొందరగా శిక్షపడేందుకు అవకాశం ఉంటుంది. ఇలా శిక్షలు పడుతుండగా ఈనెల 2న నగరానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక ప్రేమ వ్యవహారం కారణంగా బిడ్డకు జన్మనివ్వడం సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు బాధితురాలితో పాటు వారి తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి.
చట్టం ఏం చెబుతోంది
18 ఏళ్ల లోపు బాలురు, బాలికలకు రక్షణ కల్పించేందుకు 2012లో పోక్సో చట్టాన్ని తెచ్చారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, శరీర భాగాలను తాకినా, వెంటపడినా(ఫాలో), లైంగిక ఉద్దేశంతో అసభ్యంగా ప్రవర్తించినా, అసభ్యకరమైన సైగలు చేసినా, మాటలు మాట్లాడినా, సందేశాలు పంపినా, అసభ్య చిత్రాలు చూపించినా, వీడియోలు తీసినా, తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడినా ఈ చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు. కేసు తీవ్రతను, బాధితుల వయస్సును బట్టి నిందితులకు ఏడాది నుంచి జీవిత ఖైదు, 20 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఇంతటి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నా నిందితులు వెరవడం లేదు. ఇవి పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులు కాగా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా రాజీ అవుతున్న కేసులు ఎన్నో ఉన్నాయి. సగం కేసుల్లో పరువుపోతుందని బాధితులు బయటకు చెప్పుకోవడం లేదు. ఇలాంటి కేసుల్లో బాధితులు పాలమూరులోని భరోసా కేంద్రానికి నేరుగా వెళ్లి తమ బాధలు చెప్పుకునే అవకాశం ఉంది. అక్కడ వారికి భరోసా కల్పించడంతో పాటు నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
13 నెలల్లో 155 పోక్సో కేసులు
జిల్లాలో 2025, 2026 జనవరి నాటికి 155 పోక్సో కేసులు నమోదయ్యాయి. అంటే నెలకు సగటున 12 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇందులో 50 కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉండగా, 105 కేసులు ట్రయల్ నడుస్తున్నాయి. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడాలంటే 3-4 ఏళ్ల సమయం పడుతోంది.