Share News

సాగు.. జాగు

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:30 PM

ఆరుద్ర వచ్చిందంటే అన్నదాతలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉండేవారు. ఆరుతడి పంటలు పొట్ట, పూత దశకు చేరుకోనుండగా, వరి నాట్ల కోసం కరిగెట్లు చేస్తూ సందడి కనిపించేది.

సాగు.. జాగు
అమిస్తాపూర్‌లో వాడుతున్న మొక్కజొన్న పంట

ఉమ్మడి జిల్లాలో తీవ్ర వర్షాభావం

ఆరుద్ర వచ్చినా పంటలు అంతంతే..

గతేడాది జూలై రెండో వారంతో పోలిస్తే సాగు నాలుగో వంతే

70 శాతం లోటు వర్షపాతంతో అన్నదాత ఆందోళన

ఎండుతున్న ఆరుతడి పంటలు.. మొదలు పెట్టని కరిగెట్లు

21 మండలాల్లో భారీ లోటు.. 29 మండలాల్లో లోటు వర్షపాతం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కాస్త మెరుగు

మహబూబ్‌నగర్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఆరుద్ర వచ్చిందంటే అన్నదాతలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉండేవారు. ఆరుతడి పంటలు పొట్ట, పూత దశకు చేరుకోనుండగా, వరి నాట్ల కోసం కరిగెట్లు చేస్తూ సందడి కనిపించేది. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు ఆలస్యమవుతోంది. ఇప్పటివరకు చాలా వరకు ఆరుతడి పంటలే వేయలేదు. వేసిన వాటిలో 70 శాతం వాడిపోతున్నాయి. ఇక వరినాట్లు వేయడం కాదు కదా.. తుకాలే చాలామంది పోసుకోలేదు. బోర్లు ఉన్న వాళ్ళు మాత్రం తు కాలు పోసుకుని, కరిగెట్లు చేసేందుకు నింగికేసి ఎదురుచేస్తున్నారు. ఓవైపు తుకాలు ము దురుతుండగా, మరోవైపు చేసిన కరిగెట్లు ఎండుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. జూలై రెండో వారం ముగుస్తున్నా ఉమ్మడి పాలమూరులో ఇప్పటి వరకు నాలుగోవంతు మాత్రమే పంటలు సా గు సాగయ్యాయి. వరి నామమాత్రంగా కూడా సాగుచేయని దుస్థితి నెలకొంది.

గతేడాది ఇప్పటికే 50 శాతం వరి సాగు

గత 2025 జూలై రెండోవారం నాటికి ఆరుతడి పంటలు ఏపుగా పెరిగి, పచ్చగా కళకళలాడాయి. వరి సాగు 50 శాతం పూర్తి పూర్తయ్యింది. కానీ ప్రస్తుతం రైతులు యూరియా కోసం తెచ్చిన యాప్‌ ద్వారా దొరుకుతుందో? లేదోనని ముందస్తుగానే కొనుగోలు చేసి పెట్టుకున్నారు. తీరా వర్షాలు కురవకపోవడంతో దానిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది సగం కూడా పంటలు సాగయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికే అదును దాటిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురవకపోగా, ఎండలు కాస్తుండటంతో తేమ శాతం తగ్గి ఆరుతడి పంటలు ఎండుతున్నాయని వాపోతున్నారు. పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలు వాడుతున్నాయని, మరో మూడునాలుగు రోజులు వర్షాలు కురవకపోతే పంటలు చేతికందే పరిస్థితి లేదని అంటున్నారు. బోర్లు ఉన్న రైతులు డ్రిప్‌, స్ర్పింక్లర్ల సాయంతో పత్తిపంటకు నీళ్లు పెడుతున్నారు. వర్షాభావంతో బోర్లలో కూడా నీటిమట్టం తగ్గి, తక్కువగా పోస్తుండటంతో పదెకరాలున్న రైతులు రెండు, మూడు ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేస్తున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే బోర్లకింద సాగు చేసే రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారనుంది.

64 శాతం మండలాల్లో లోటు వర్షపాతం

ఉమ్మడి పాలమూరులో ఇప్పటివరకు 64 శాతం మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఒక్క నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మాత్రం కాస్త వర్షాలు కురవడంతో అక్కడ సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా నాలుగు జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 78 మండలాలకు గాను 21 మండలాల్లో భారీ లోటు వర్షపాతం నమోదుకాగా, 29 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 10 మండలాల్లో సాధారణంకన్నా అధిక వర్షపాతం, 18 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూలై 11 నాటికి 136.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, 99.4 మిల్లీ మీటర్ల వర్ష పాతం(27 శాతం లోటు) నమోదు నమోదైంది. నారాయణపేట జిల్లాలో 135కు 87.3(35 శాతం లోటు), గద్వాల జిల్లాలో 111.8కు కేవలం 30.3(72 శాతం లోటు) మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 115.5 మిల్లీ మీటర్లకు 117 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఇక్కడ మాత్రం 2.26 మిల్లీ మీటర్లు అధికంగా నమోదైంది. ఇక్కడ అడపాదడపా కురుస్తున్న వానలకు ఆరుతడి పంటలు కాస్త బెటర్‌గానే ఉన్నాయి. పలు మండలాల్లో సాధారణం కన్నా అధిక వర్షం కురగా, 40 శాతం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అదే గతేడాది జూలై 11 నాటికి అన్ని జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది.

కరిగెట్లు చేద్దామంటే వానలేదు

10 ఎకరాల్లో వరి నాటేందుకు నారు పోశాను. ఇప్పటివరకు వానలు పడితే నాట్లు పడేది. వానలు కురవకపోవడంతో కరెగెట చేయడం లేదు. ఒక్కబోరు ఉండగా దానికింద తుకం పోసుకున్నం. బోరు నీటితో కొంత కరిగెట చేద్దామంటే నీళ్లు తగ్గిపోవడం వల్ల చాలక పంట ఎండుతుందేమోనని చేయడం లేదు.

- రైతు జక్కిరెడ్డి, రైతు, వెల్కిచర్ల

గతేడాది ఇప్పటికే వరినాట్ల వేశాం

గతేడాది జూలై 10 నాటికి 10 ఎకరాల్లో వరి నాట్లు వేసినం. ఈసారి తుకాలు పోసుకున్నం. కానీ వానలు లేకపోవడంతో తుకాలు కూడా సరిగా పోసుకోలేదు. మొక్కజొన్న వేసినా నీళ్లు లేక వాడుతోంది. మరో నాలుగైదు రోజులు వాన పడకుంటే ఎండిపోతది. పరిస్థితి దయనీయంగా ఉంది.

-కొండ యాదయ్య, రైతు, హన్వాడ

Updated Date - Jul 12 , 2026 | 11:30 PM