కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:32 PM
ఏకంగా జిల్లా కలెక్టర్ పేరు, ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాల ద్వారా డబ్బులు అడుగుతూ వస్తున్న సందేశాలను నమ్మవద్దని,
- సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- డబ్బులు అడిగితే నమ్మొద్దు : కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్
గద్వాల క్రైం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఏకంగా జిల్లా కలెక్టర్ పేరు, ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాల ద్వారా డబ్బులు అడుగుతూ వస్తున్న సందేశాలను నమ్మవద్దని, ఎవరు కూడా డబ్బులు పంపి మోసపోవద్దని జోగుళాంబ గద్వాల జిల్లా కలె క్టర్ రిజ్వాన్‌బాషా షేక్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. తన పేరు, ఫొటో ను వాట్సాప్ డీపీగా ప్రజలకు సందేశాలు పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇటువంటి సందేశాలు పూర్తిగా నకిలీవని, వాటిని ఎవరూ నమ్మవద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై ఇప్పటికే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించినట్లు కలెక్టర్ వివరించారు. వాట్సాప్, సోషల్ మీడియాలో కలెక్టర్, ప్రభుత్వ అధికారుల ఫొటోలు, పేర్లు, హోదాలు కనిపించినంత మాత్రాన అవి నిజమైన ఖాతాలని నమ్మవద్దని తెలిపారు. తమ పేర్లను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేయడం తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.