నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:26 PM
నారాయణపేట జిల్లాలో నిమజ్జనోత్సవాలకు పోలీస్‌శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
- ఈ నెల 24న నారాయణపేట, మక్తల్‌లలో నిర్వహణ
- శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు
- విలేకరుల సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట క్రైం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : నారాయణపేట జిల్లాలో నిమజ్జనోత్సవాలకు పోలీస్‌శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని 125 మంది డీజే నిర్వహకులు, 28 మంది రౌడీషీటర్లు, 77 మంది కమ్యూనల్ షీటర్లను ముందస్తుగా బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ముందుగా నారాయణపేట, ఆ తర్వాత మక్తల్‌లో నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యేవని తెలిపారు. కానీ, ఈ సంవత్సరం రెండు చోట్లా ఒకేసారి నిమజ్జనం ప్రారంభం అవుతుందని తెలిపారు. అందుకోసం జిల్లా వ్యాప్తంగా 800 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,728 వినాయక విగ్రహాలు ఉన్నాయని, వాటన్నింటినీ జియో ట్యాగింగ్ చేశామన్నారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా పోస్టులు పెడితే సహించేది లేదని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శోభాయాత్ర ఆద్యంతం సీసీ, డ్రోన్, వీడియో కెమెరాలతో చిత్కీరించనున్నట్లు తెలిపారు. గణేశ్ ఉత్సవాల ముగింపు సందర్భంగా బెల్డ్ దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఎక్కడైనా మద్యం నిల్వలు ఉంటే సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు మహేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.