Share News

వరదలొచ్చినా..!

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:33 PM

డిసెంబరు వరకు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్‌ఎల్‌ఐ)లోని మూడు రిజర్వాయర్లను డిసెంబరు వరకు నింపాలనే లక్ష్యం పెట్టుకున్నది.

వరదలొచ్చినా..!
నార్లాపూర్‌ పంప్‌హౌజ్‌లో మొదటి మోటార్‌ వెట్‌రన్‌

- ఎన్‌డీఎ్‌సఏ రిపోర్టు వస్తేనే పీఆర్‌ఎల్‌ఐ రిజర్వాయర్లకు నీరు

- ఈ నెల 6న నార్లాపూర్‌, ఏదులను పరిశీలించిన ఎన్‌డీఎ్‌సఏ

- ఇప్పటికే రెండు మోటార్ల వెట్‌రన్‌.. వారంలో మరో మోటార్‌

- ఏదుల లింక్‌లో 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌ పెండింగ్‌

- ఈ సీజన్‌లో రెండు రిజర్వాయర్లు నింపితే తాగునీటికి బేఫికర్‌

- కల్వకుర్తి ఆయకట్టుకు కూడా నార్లాపూర్‌ నీరు వాడుకునే ఛాన్స్‌

మహబూబ్‌నగర్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : డిసెంబరు వరకు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్‌ఎల్‌ఐ)లోని మూడు రిజర్వాయర్లను డిసెంబరు వరకు నింపాలనే లక్ష్యం పెట్టుకున్నది. జూన్‌లో రెండు రోజులపాటు పాలమూరు ప్రాజెక్టులను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇరిగేషన్‌ అధికారులకు ఈ విషయంలో కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యుత్‌శాఖకు బిల్లుల చెల్లింపు పూర్తిచేసిన ప్రభుత్వం పీఆర్‌ఎల్‌ఐలో మొదటి పంపింగ్‌ స్టేషన్‌లో మోటార్ల వెట్‌రన్‌ ప్రారంభించింది. ఇప్పటికే రెండు మోటార్ల వెట్‌రన్‌ను విజయవంతంగా పరీక్షించగా ఈ వారంలో మరో మోటార్‌ను పరీక్షించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ సీజన్‌లో ఇప్పటివరకు వరద ప్రారంభం కాలేదు. ఎగువన ప్రాజెక్టులు నిండి ఆగస్టు మొదటివారంలో శ్రీశైలానికి వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్‌ఎల్‌ఐలో భాగంగా ఉన్న నార్లాపూర్‌, ఏదులను ఎట్టి పరిస్థితుల్లో నింపాలని అధికారులు ప్రణాళిక చేసుకుంటున్నారు. ఈ రిజర్వాయర్లు నింపాలంటే నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ అనుమతి రావాల్సి ఉంది. ఈ నెల 6వ తేదీన నార్లాపూర్‌, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను ఎన్‌డీఎస్‌ఏ బృందం పరిశీలించి వెళ్లగా ఆ రిపోర్టు రావాల్సి ఉంది. అక్కడి నుంచి అనుమతి వచ్చిన వెంటనే మొదట నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను నింపి తర్వాత ఏదుల రిజర్వాయర్‌ నింపే అవకాశాలు ఉన్నాయి. రెండో పంపింగ్‌ స్టేషన్‌ అయిన ఏదులలో ఇప్పటికే మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. వాటిని మొదట డ్రైరన్‌ పరీక్షలు చేయాల్సి ఉంది. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ చార్జింగ్‌ గతంలో పూర్తయినందున సీఎం ఆదేశాలతో పెండింగ్‌ పనులను పూర్తి చేయడంలో వేగం పెరిగింది.

పనుల్లో పెరిగిన వేగం

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టుల పర్యటనకు ముందు మొదటి రిజర్వాయర్‌ అయిన ఏదుల నుంచి నార్లాపూర్‌ వరకు మధ్యలో ఉన్న ప్రధాన కాలువ ప్యాకేజీ-3లో 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌ పెండింగ్‌లో ఉన్నది. ఇక్కడ పనుల ఆలస్యానికి కుడికిళ్ల గ్రామంలో భూసేకరణ పెండింగ్‌ ఉండటం, తీర్నంపల్లి వద్ద సదరు 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు మొత్తం బండ రావడంతో బ్లాస్టింగ్‌ తదితర పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే సీఎం సమీక్ష తర్వాత భూసేకరణ పూర్తికావడంతో పనుల్లో వేగం పెరిగింది. నెలకు 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల చొప్పున ఇప్పటికే 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌ను పూర్తిచేశారు. అక్టోబరు చివరి నాటికి మిగిలిన 6 లక్షల క్యూబిక్‌ మీటర్లను కూడా పూర్తిచేయనున్నారు. అలాగే ప్రధాన కాలువపై మూడు చోట్ల బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా పెండింగ్‌లో ఉన్నది. ప్రస్తుతం ఆ పనులను కూడా ప్రారంభించారు. అలాగే ప్యాకేజీ-4లో 620 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వర్క్‌ పెండింగ్‌లో ఉండగా ఆ పనులు కూడా నడుస్తున్నాయని ఈఈ లోకీలాల్‌ తెలిపారు. ఒకవేళ ఆగస్టులో శ్రీశైలానికి వరద ప్రారంభమైనా ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టుతో పాటు ఏదులకు తరలించడానికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. వరద వస్తే డిసెంబరు వరకు నీటిని తీసుకునే వెసులుబాటు ఉంటుందని, అక్టోబరు చివరి నాటికి పెండింగ్‌ పనులను పూర్తిచేసి మొదటి దశలో రెండు రిజర్వాయర్లను నింపుతామని అధికారులు చెబుతున్నారు.

నీళ్లుంటే తాగు, సాగుకు ఉపయోగం...

వాస్తవానికి పీఆర్‌ఎల్‌ఐ రిజర్వాయర్లలో నీటిని నింపినా డిస్ర్టిబ్యూటరీల కోసం భూసేకరణ కాకపోవడం, నార్లాపూర్‌, ఏదుల రెండూ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు కావడం వల్ల ఆయకట్టు స్థిరీకరణ అయ్యే అవకాశాలు లేవు. కానీ, ఈ రెండు రిజర్వాయర్లను నింపుకోలగితే భూగర్భజలాలు పెరగడంతో పాటు నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి పక్కనే ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు రిజర్వాయర్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్లూయిజ్‌ల ద్వారా నీటిని తరలించుకోవచ్చు. తద్వారా ఎల్లూరు రిజర్వాయర్‌పై ఆధారపడి ఉన్న మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ద్వారా తాగునీటి కష్టాలను తీర్చవచ్చు. ఈ గ్రిడ్‌ నుంచి 12 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా 19 మునిసిపాలిటీలు, 18 నియోజకవర్గాల్లోని 88 మండలాల పరిధిలో ఉన్న 4వేల ఆవాసాలకు నీరందుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వరదలు తక్కువ వస్తే ఈ మొత్తం ఆవాసాలకు తాగునీరు అందించడానికి నార్లాపూర్‌లో నీటిని నింపుకోవడం సులభమై వచ్చే వేసవిలో కూడా ఇక్కట్లు దూరమవుతాయి. అలాగే వరద బాగా వస్తే నార్లాపూర్‌ నుంచి ఎల్లూరులో నీరు నింపడం ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టు సాగునీటి అవసరాలను తీర్చవచ్చు. పీఆర్‌ఎల్‌ఐ భూసేకరణ పూర్తయ్యే వరకు కల్వకుర్తి ద్వారా సాగునీటి అవసరాలను తీర్చే అవకాశాలు మెండుగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోపు ప్రభుత్వం కాలువల భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసి సేకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Updated Date - Jul 23 , 2026 | 11:33 PM