Share News

హెల్మెట్‌ ఉంటేనే కలెక్టరేట్‌లోకి అనుమతి

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:28 PM

నేటి నుంచి కలెక్టరేట్‌లోకి ప్రవేశించే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ తప్పక ధరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు.

హెల్మెట్‌ ఉంటేనే కలెక్టరేట్‌లోకి అనుమతి
వాహనదారులకు హెల్మెట్లు అందజేస్తున్న కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ శ్రీనివాసరావు

  • జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల న్యూటౌన్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నేటి నుంచి కలెక్టరేట్‌లోకి ప్రవేశించే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ తప్పక ధరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ఎదుట పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్‌- అలైవ్‌ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అరైవ్‌.. అలైవ్‌ కేవలం నినాదం కాదని, ప్రతీవ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే సామాజిక బాధ్యతను గుర్తు చేసే ఉద్యమమన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం కుటుంబాలకు తీరని లోటన్నారు. అందువల్ల ప్రతీ వాహనదారుడు రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాన్ని ప్రతీ ఇంటికీ, ప్రతీ వ్యక్తికి చేరవేసే ప్రమాదరహిత జిల్లాగా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు రహదారి నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను, ట్రాఫిక్‌ ఎస్‌ఐ బాలచంద్రుడు, రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌, పట్టణ రెండవ ఎస్‌ఐ సతీశ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:29 PM