ఎమ్మెల్యేల్లో జోష్..
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:36 PM
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తికావస్తోంది.
- కొత్త పింఛన్లు, జీవిత బీమా అమలుతో వరుస కార్యక్రమాలు
- పలుచోట్ల స్మార్ట్ రేషన్ కార్డులతో కలిపి ప్రొసీడింగ్స్ అందజేత
- ఇన్నాళ్లు నియోజకవర్గాలకు దూరంగా ఉన్నవారూ పర్యటనలు
- ప్రజలకు దూరంగా ఉంటున్నారనే హెచ్చరికలూ ఒక కారణం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాలు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో జోష్‌ను నింపుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన కొత్త పింఛన్ల మంజూరుకు ఇటీవల ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అనేకమార్లు దరఖాస్తులు తీసుకోవడం, మంజూరును వాయిదా వేస్తూ వచ్చి ఎట్టకేలకు ప్రొసీడింగ్స్ పంపిణీని ప్రారంభించింది. అదే సమయంలో గత బడ్జెట్లో ప్రకటించిన విధంగా సిద్ధిపేట వేదికగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఇన్నాళ్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ.. సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పలు సందర్భాల్లో పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు.. ప్రస్తుతం కొత్త పథకాలు తోడవడం, దీంతోపాటు ఏళ్లుగా కార్డుల కోసం ఎదురుచూస్తున్న రేషన్ లబ్ధిదారులకు కొత్తగా రూపొందించిన స్వార్ట్ కార్డులను కలిపి పంపిణీ చేయడంతో ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా వారికి ప్రధానంగా వచ్చే వినతుల్లో పింఛన్లు ఎప్పుడిస్తారనేది అత్యంత ముఖ్యంగా ఉండేది. ఇప్పుడు వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, హెచ్ఐవీ, ఫైలేరియా, టీబీ వ్యాధిగ్రస్తులకు కొత్త పింఛన్లు మంజూరు కావడంతో చాలా వరకు బాధ తగ్గిందని చెబుతున్నారు. దీంతో పాటు వృద్ధులకు కూడా పింఛన్లు మంజూరు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే త్వరలో వాటిని కూడా చేపట్టవచ్చనే హామీ ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఇంత మెజారిటీ వచ్చినా.. చాలా మందిలో మూడేళ్లుగా కొంత అసంతృప్తి ఉంది. ప్రధానంగా నిధుల విషయంలో, కేటాయింపుల విషయంలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పలుమార్లు బహిరంగ వేదికలపైనే విమర్శలు చేస్తుండటం సంచలనం కలిగిస్తోంది. ఇప్పుడు కొత్త పథకాల అమలు వారిలోనూ కొంత ఊపును తెస్తుందనే అభిప్రాయం ఉంది.
నియోజకవర్గాల బాటలో ...
ప్రజాప్రతినిధులకు ఏదైనా అభివృద్ధి పనికి శంకుస్థాపన కార్యక్రమమో లేదా సంక్షేమ కార్యక్రమాల అమలుకోసం ప్రజాక్షేత్రంలో వెళ్తుంటారు.. వాటి అమలు తాత్సారం అయ్యేకొద్ది.. ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి సమాధానం చెప్పలేకపోతుంటారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అభయహస్తం దరఖాస్తులు, మహాలక్ష్మి పథకం, సబ్సిడీ సిలిండర్లు, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు తదితర పథకాలతో శ్రేణుల్లో జోష్ ఉండేది. ఆ తర్వాత పెద్దగా పథకాల అమలు లేదు. మధ్యలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించగా.. ఇప్పుడిప్పుడే అవి పూర్తవుతుండగా, గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు మొన్నటి వరకు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం, సీఎంఆర్ఎప్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ మాత్రమే ప్రధానంగా ఉండేది. కొందరు ఎమ్మెల్యేలు ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుండగా.. మరికొందరు మాత్రం ప్రజల్లోకి వెళ్లడం లేదు.. నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదు.. వచ్చినా సాయంత్రానికి హైదరాబాద్‌కు వెళ్లడం, కార్యకర్తలకు, ప్రజలకు అసలు సమయం ఇవ్వకపోవడం వంటి వాటితో పలుచన అవుతున్న పరిస్థితి. తాజాగా కొత్త పథకాల అమలుతో వారు కూడా నియోజకవర్గాల బాట పడుతున్నారు. సాధ్యమైనంత మేర నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రజలకు అందుబాటులో..
గెలిచిన తర్వాత నియోజకవర్గాలకు సమయం ఇవ్వకపోవడం, ఎప్పుడు చూసినా హైదరాబాద్‌లోనే ఉండటం వంటి పనులతో కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజలకు దూరం అవుతున్నారని ఇటీవల పార్టీకి సమాచారం అందినట్లు తెలుస్తుండగా.. కచ్చితంగా నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని పార్టీ పెద్దలు హెచ్చరించినట్లు సమాచారం. ఈ మేరకు ఎమ్మెల్యేలకు సూచనలు వెళ్లాయి. ఇప్పుడు కొత్త పథకాల ప్రారంభిస్తుండటంతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ పర్యటన, అంతకుముందు పలు సందర్భాల్లో ఆయన దగ్గరకు వెళ్లిన ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని సూచించారు. అంతా తానే ఏదో చేస్తానని తనపైనే వదిలేయొద్దని, నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ.. ప్రతిపక్షాలకు దీటుగా బదులివ్వాలని కూడా చెప్పారని కొందరు పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. తాను కూడా ప్రతీ నెలా నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని, ప్రారంభించిన పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల తాను నియోజకవర్గంలో మూడు రోజులపాటు పర్యటించగా.. ఈ నెల 26న నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగానే కొత్త పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. ఏదిఏమైనా ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచిన సందర్భంగా కొత్త పథకాలతో ఎమ్మెల్యేలూ జోష్‌లో ఉన్నారని చెప్పవచ్చు.