ప్రతిభ గల క్రీడాకారులకు ప్రోత్సాహం
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:21 PM
ప్రతిభ గల క్రీడాకారులను ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
- కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
- గద్వాలలో అట్టహాసంగా రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభం
గద్వాల అర్బన్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రతిభ గల క్రీడాకారులను ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్‌లో 70వ రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ఆటలతో పాటు చదువులోనూ ముందుండాలన్నారు. రాష్ట్రస్థాయి పొటీల్లో మంచి ఆటతీరుతో జట్టు విజయానికి దోహదపడాలన్నారు. సమష్టి కృషితోనే విజయాలు సొంతమవుతాయని చెప్పారు. డీవైఎస్‌వో రామలింగేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చెడుఅలవాట్లకు బానిసలు కాకుండా క్రీడల పట్ల మక్కువను పెంచుకుని రాణించాలన్నారు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి పది జిల్లాల జట్లు, 250 మంది క్రీడాకారులు, కోచ్, మేనేజర్లు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో డీఈవో విజయలక్ష్మి, మునిసిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మియాదవ్, రాష్ట్ర పరిశీలకుడు డేవిడ్, టోర్నమెంట్ కన్వీనర్ బీసన్న, స్టేడియం ఇన్‌చార్జి బషీర్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు నగేష్ బాబు, భరత్‌కుమార్, హైమావతి, స్రవంతి, రజనీకాంత్, క్రికెట్ కోచ్ శ్రీనివాసులు ఉన్నారు.
మొదటి రోజు మ్యాచ్ వివరాలు
ఎస్‌జీఎఫ్ అండర్-17 బాలుర క్రికెట్ టోర్నీలో మొదటి రోజు కరీంనగర్- వరంగల్ జట్లు తలపడ్డాయి. నిర్ణీత 12 ఓవర్లలో కరీంనగర్ జట్టు ఏడువికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ జట్టు 12 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 85 పరుగులే చేసింది. దీంతో కరీంనగర్ జట్టు విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్‌లో నల్లగొండ- నిజామాబాద్ జట్లు తలపడ్డాయి. నిర్ణీత 12 ఓవర్లలో నల్లగొండ జట్టు మూడు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్‌కు దిగిన నిజామాబాద్ జట్టు మొత్తం ఓవర్లు ఆడి ఆరు వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. ఒక్క పరుగు తేడాతో నల్లగొండ జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో రంగారెడ్డి- ఖమ్మం జట్లు తలపడగా, మొదట ఖమ్మం జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 12 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. రంగారెడ్డి జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 76 పరుగులే చేయగలిగింది. 12 పరుగులతో ఖమ్మం జట్టు విజయం సాధించింది.