Share News

ఉపాధి హామీ, సీసీ రోడ్లపై కొత్త సర్పంచుల ఆశలు

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:33 PM

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వారి మద్దతుదారులు ఫిబ్రవరి చివరి వారంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు వస్తాయని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

ఉపాధి హామీ, సీసీ రోడ్లపై   కొత్త సర్పంచుల ఆశలు
ఉపాధిహామీ నిధులతో చేపట్టిన శేరిపల్లి గ్రామపంచాయతీ భవనం

- ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వ భవనాలకు మెటీరియల్‌ నిధులు

- గ్రామ సంఘాలు, జీపీ, అంగన్‌వాడీలకు రూ.40 కోట్లు

- మంజూరవుతున్న 15వ ఆర్థిక సంఘం నిధులు

- మొదటి విడతలో రూ.11కోట్లు విడుదల

- తాజాగా మరో రూ.8 కోట్లు మంజూరు

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 18 (ఆంఽధ్రజ్యోతి) : కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వారి మద్దతుదారులు ఫిబ్రవరి చివరి వారంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు వస్తాయని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఏడాదంతా చేసిన చేసిన పనుల్లో మిగిలిన మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతో ఆర్థిక సంవత్సరం చివరి నెలలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టేవారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే విధానం కొనసాగుతుంది. మార్చ్‌ చివరి నాటిని పనులను పూర్తి చేసి ఎంబీ రికార్డ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ నిధులు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. వీటి బదులు గ్రామాలలో భవన నిర్మాణ పనులకు ఇప్పటికే మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను కేటాయించారు. దాదాపు రూ.40-50 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో జిల్లాలో 250 గ్రామ సంఘాల భవనాలు, 86 కొత్త గ్రామ పంచాయతీ భవనాలు, 44 అంగన్‌వాడీ కేంద్రాలు, 139 ప్రభుత్వ పాఠశాలల ప్రహరీలు, ధాన్యం నిల్వకు 15 గోదామ్‌లు నిర్మించాల్సి ఉంటుంది. వాటిలో ఇప్పటికే కొన్ని పనులు పూర్తికాగా, మరి కొన్ని వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పోను మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిదులు ఏమైనా మిగిలితే జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు సీసీ రోడ్లకు కేటాయించనున్నారు. అయితే ఈ నిధులు తక్కువగానే వచ్చే అవకాశం ఉందని, ఫిబ్రవరి చివరి నాటికి స్పష్టత రానున్నదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచులు, కార్యకర్తలు ఈ నిధులపై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఆ నిధులు ఉంటే ఇప్పటికే అన్ని గ్రామాల్లో సీసీరోడ్ల పనులు ప్రారంభం అయ్యేవి. కానీ అలాంటి వాతావరణం కనిపించడం లేదు.

చిన్నాచితక ఖర్చులకే ఆర్థిక సంఘం నిధులు

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వారి మద్దతుదారులు పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించారు. అందుకోసం నిదుల అన్వేషణలో నిమగ్నమయ్యారు. ఎన్నికలు పూర్తవడంతో కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిఽధులు వస్తున్నాయి. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో చివరి విడత టైడ్‌ గ్రాంట్స్‌ (60 శాతం నిధులు) రూ.11 కోట్లు విడుదలయ్యాయి. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. ఈ నిధులను కేవలం పారిశుధ్యం, తాగునీటి వసతికే వినియోగించాలి. మొదటి విడతలో వచ్చిన నిధులు ప్రత్యేక పాలనా కాలంలో పంచాయతీ కార్యదర్శులు పెట్టిన బిల్లులకే సగం పోగా, కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో వీధిదీపాలు, ట్రాక్టర్ల మరమ్మతులు చేయించారు. ఈ నిధులు దాదాపు వాటికే సరిపోయాయి. తాజాగా ప్రభుత్వం రెండో విడత (2024-25)కు సంబంధించిన 40 శాతం టైడ్‌ నిధులను కూడా విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామసభ తీర్మానం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ విడతలో మరో రూ.8 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే చిన్న పంచాయతీలకు ఈ నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదు. రెండేళ్ళుగా పాలకమండలి లేకపోవడంతో, ప్రత్యేకాధికారుల పాలనలో నిధులు లేక పంచాయతీలు నీరసించాయి. ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తేనే కొంత కళను సంతరించుకోనున్నాయి. కనీసం ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షలు కేటాయిస్తేనే కొంతవరకు పనులు చేయించడానికి అవకాశం ఉంటుందని సర్పంచులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో వారు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయాలంటే నిధుల కొరత వెక్కిరిస్తోంది. ఇప్పటికే చాలామంది సర్పంచులు వినతులు పట్టుకుని ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి వస్తే తప్ప నిధులు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం అవుతోంది.

Updated Date - Feb 18 , 2026 | 11:33 PM