వృద్ధ తల్లిదండ్రులు వృథాకాదు
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:41 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 109 ట్రామా కేంద్రాల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు వృద్ధ తల్లిదండ్రులు వృథా కాదని, వారి కోసం 37 ప్రణామ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు.
-----------------------------------------------------------
- చదువుతోనే సామాజిక న్యాయం
- విద్యా, వైద్యం, సంక్షేమ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
- నాగర్‌కర్నూలులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో మంత్రి దామోదర రాజనరసింహ
నాగర్‌కర్నూల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 109 ట్రామా కేంద్రాల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు వృద్ధ తల్లిదండ్రులు వృథా కాదని, వారి కోసం 37 ప్రణామ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యథాశక్తిగా ప్రయత్నం చేస్తుందన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి ఎండబెట్ల, కేసరి సముద్రం కింది అలుగు భాగంలో హైలెవల్ కాజ్‌వే నిర్మాణానికి రూ. 10 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నూతనంగా నిర్మించిన 8వ తరగతి గదులను ప్రారంభించి రూ. 9 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జరిగిన సభలో మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ చదువుతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ విద్యను పేద, మధ్య తరగతి వర్గాలకు చేరువ చేయాలనే సంకల్పంతోనే ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. రూ. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతకు ముందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. సరైన ప్రణాళికతో ఎలా ముందుకెళ్లాలో దిశా నిర్దేశం చేశారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో 4 కోట్ల మంది జనం ప్రజాపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి ప్రసంగిస్తూ రెండేళ్లలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి, మంత్రులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్, మార్కెట్ చైర్మన్ రమణరావు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ హాబీబ్, కాంగ్రెస్ నేతలు కోటయ్య, పెద్దపల్లి వెంకటయ్య పాల్గొన్నారు.