సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:27 PM
సలేశ్వరం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
- నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్
అచ్చంపేట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : సలేశ్వరం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. జాతరపై కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, డీఎఫ్‌వో రేవంత్‌చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చేనెల నుంచి 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు జాతర ఉంటుందని, ఆ మేరకు భక్తులను ఫర్హాబాద్ నుంచి అడవిలోకి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటవీశాఖ సిబ్బందితో కలిసి పోలీస్ శాఖ వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేపట్టాలని సూచించారు. రాత్రివేళల్లో కాలినడకన వచ్చే భక్తుల కోసం సోలార్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేటల నుంచి జాతరకు బస్సు సర్వీసులు నడిపించాలని డిపో మేనేజర్లను ఆదేశించారు. వైద్య శాఖ తరపున ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బందితో పాటు, అంబులెన్స్‌లను 24 గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జాతర సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులు, చెంచు సంఘాల నాయకులు లింగస్వామి, గురువయ్య, ఈర్లపెంట సర్పంచ్ శివమ్మ పాల్గొన్నారు.