ఎల్‌నినో పాలిట్రిక్స్..!
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:24 PM
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడటం ఏమో కానీ.. రాజకీయ అవసరాలకు చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా 43 శాతం ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు సెప్టెంబరు మాసంలోనే 80 శాతం లోటు నమోదైంది.
- ప్రాజెక్టుల నీటి విడుదలపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్
- తాగునీటి అవసరాలకు నిల్వలు ఉంచిన అధికారులు
- పంటలకు విడుదల చేయాల్సిందేనంటున్న బీఆర్‌ఎస్
- అలా చేస్తే వేసవిలో తాగునీటి ఇక్కట్లంటున్న కాంగ్రెస్
- రాజకీయ అవసరాల కోసం రైతులు, ప్రజలతో చెలగాటం
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడటం ఏమో కానీ.. రాజకీయ అవసరాలకు చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా 43 శాతం ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు సెప్టెంబరు మాసంలోనే 80 శాతం లోటు నమోదైంది. ఈ పరిస్థితుల్లో రైతులను, ప్రజలను కష్టాలపాలు చేయకుండా.. ప్రస్తుతానికి వారు అసంతృప్తితో ఉన్నా.. దీర్ఘకాలంలో నష్టపోకుండా, ఇబ్బందులు పడకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, రాజకీయ పక్షాలకు ఉంది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం రాజకీయ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టించడం, వారిని రెచ్చగొట్టడం వంటివి చేస్తూ తీవ్ర నష్టం చేస్తున్నారు. కరువు పరిస్థితులను పక్క రాష్ట్రం నీటి వాడకం వైపు నెట్టి.. ఇక్కడి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే దీనికంటే పెద్ద రాజకీయ అంశాలు ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది ప్రజల జీవితం నీటి చుట్టూ ఉండటంతో భావోద్వేగాలను రెచ్చగొట్టే పనిలో పడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికార వ్యవస్థలు కూడా పని చేయకుండా.. కేవలం రాజకీయ పార్టీలు రెచ్చగొడితే ఆ పనులు జరుగుతాయనే దురాభిప్రాయం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్‌నినో ప్రభావాన్ని సాధ్యమైనంత మేర ఉపయోగించుకుంటే రైతుల సమస్యల పోరాట చాంపియన్లుగా నిలవొచ్చనే భావన రాజకీయ పార్టీల్లో ఉంది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి ఏపీ నీటి విడుదల, విద్యుత్ సరఫరా, ఎరువుల కొరత వరకు అన్నింటినీ ప్రతిపక్షం వాడుతోంది. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్ గతంలో నీటి విడుదల కోసం ధర్నా చేయగా.. సోమవారం ధర్నాలకు పిలుపునిచ్చింది. దీంతో ప్రభుత్వం వారిని ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేసింది. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆ అంశంపై ధర్నా చేసేందుకు జూరాలకు రానున్నారు.
జరిగింది.. జరుగుతోంది ఇదే...:
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది నీరే రైతులకు జీవనాధారం. ఈసారి స్థానికంగా వర్షాలు లేకపోవడం, ఎగువ నుంచి ఆశించిన వరద రాకపోవడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని, తాము వరి సాగుకు నీరు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ వైపు నీరు పోతోందని, రైతుల కోసం విడుదల చేయడం లేదని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. ప్రాజెక్టుల ముట్టడి కూడా చేశారు. రైతులను తప్పుదోవ పట్టించొద్దని చెప్పిన కాంగ్రెస్... మళ్లీ రాజకీయ అవసరాల కోసం నీటిని విడుదల చేసింది. ఇక పంట చివరి వరకు నీటి విడుదల అవుతుందని నమ్మిన రైతులు ఆయకట్టుల కింద వరి సాగు చేపట్టారు. కానీ రిజర్వాయర్ల నీటి వాటాలో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఈ నెల దాటితే వర్షాలు కురుస్తాయనే నమ్మకం లేదు. దీంతో అధికారులు తాగునీటి అవసరాల దృష్ట్యా జూరాలలో ఉన్ననీటిని అట్టిపెట్టారు. దీంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రాజెక్టుపై పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. కాలువ గేట్లను తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అధికారులు మొదటి నుంచీ నీటి విడుదల చేయబోమనే చెప్పారు. కానీ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని చేసిన గందరగోళంతో రైతులు నష్టపోతున్నారు. అలాగే కష్ట సమయంలో రాజకీయ జోక్యం లేకుండా అధికారులపైనే బాధ్యత ఉంచాల్సిన ప్రభుత్వం.. నీటిని విడుదల చేసింది.. రైతులు ఆశతో పంటలు సాగుచేసి, ఇప్పుడు ఆగమాగం అవుతున్నారు. వరద వస్తున్న కాలంలో నీరు ఇచ్చినా.. పంట చివరి వరకు వర్షాలు లేకపోతే ఇవ్వలేమనే భావనతోనే ప్రభుత్వం వద్దని చెప్పింది.. అయితే వరద వస్తున్న సమయంలో సాధ్యమైనన్నీ నీళ్లను ఎత్తిపోసేందుకు అధికారులు తొందరపడలేదని మాత్రం చెప్పవచ్చు. ఏపీ వైపు ఇప్పుడు శ్రీశైలం నుంచి విడుదల కొనసాగుతున్నా.. తెలంగాణ విద్యుదుత్పత్తి మినహా ఎక్కువ స్టోరేజీకి వాడుకోవడం లేదని విమర్శ వస్తోంది. కేవలం ఒకే మోటార్‌ను నడిపిస్తున్న పరిస్థితి ఉంది.
కరెంటు తెచ్చిన గోస...
వాస్తవానికి కేవలం నీటి సమస్యతో మాత్రమే రైతులు ఇబ్బందులు పడటం లేదు. విద్యుత్ సరఫరాలో కోతలు, అంతరాయం వల్ల కూడా పంటలు ఎండిపోతున్నాయనే ఆందోళన వారిలో ఉంది. అన్నింటికీ మూలం ఎల్‌నినో అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. గతేడాదితో పోల్చితే దాదాపు 7 వేల మెగావాట్ల డిమాండ్ అధికంగా పెరిగింది. అందుకు పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో గృహ విద్యుత్ వినియోగం తగ్గకపోవడం, హైడల్ పవర్ ఉత్పత్తి దాదాపు 3 వేల మెగావాట్ల వరకు లోటు నమోదు కావడం కూడా కారణం. అన్ని రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి ఉండటం.. బొగ్గు ఉత్పత్తి సరఫరా కూడా తగ్గిపోవడంతో సెంట్రల్ గ్రిడ్ నుంచి కూడా అధిక పవర్ కొనుగోలుకు అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా వ్యవసాయానికి కోతలు విధిస్తున్నారు. కాలువల నుంచి నీరు రాకున్నా.. బోర్ల ద్వారా సాగు చేద్దామంటే విద్యుత్ కోతలు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 40 శాతం పంటలు ఎండిపోయాయి. యాసంగిలో కూడా పెద్దగా పంటలు పండే పరిస్థితులు లేవు. ఇదిలా ఉంటే కేవలం జూరాలనే కాకుండా కల్వకుర్తి కింద ఉన్న రిజర్వాయర్లను కూడా తాగునీటి అవసరాల కోసం నిల్వలు ఉంచారు. రాజకీయ అవసరాల కోసం రైతులను రెచ్చగొట్టడం, తప్పుదోవ పట్టించడం కాకుండా, కరువు పరిస్థితుల్లో ఎలాంటి పంటలు సాగుచేయాలో అవగాహన కల్పించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బీఆర్‌ఎస్ వాదన ప్రకారం జూరాల ప్రాజెక్టులో సుమారు 9 టీఎంసీల నీరు ఉందని, అందులో 6 టీఎంసీలు వాడుకోవచ్చని అంటోంది. కాంగ్రెస్ వాదన ప్రకారం ఉన్న 8.5 టీఎంసీల్లో 3.5 టీఎంసీలు డెడ్‌స్టోరేజీకి పోగా.. లైవ్ వాటర్ కేవలం 5 టీఎంసీలు మిగులుతుంది. అందులో తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీల వరకు అవసరం ఉంటుందని, మిగిలిన నీటిని విడుదల చేసినా.. పంట చివరి వరకు కొనసాగించడం సాధ్యం కాదని వాదన వస్తోంది. బీఆర్‌ఎస్ ఉన్న సమయంలోనూ దిగువకు నీరు పోయిందని, క్రాప్ హాలీడేలు కూడా ప్రకటించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.