Share News

ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:23 PM

ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు
కార్యాలయంలో ఉన్న రైతులతో వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

- సర్టిఫికెట్ల జారీపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే జీఎంఆర్‌

దేవరకద్ర, అక్టోబర్‌ (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలు, వివిధ రకాల సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ, వాటిలో జరుగుతున్న జాప్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సర్టిఫికెట్ల జారీకి సంబంధించి జ్యాప్యం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైన సమస్యపై ప్రజలు, రైతులు కార్యాలయానికి వస్తే అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తిచడం లేదని, సిబ్బంది వ్యవహరశైలి మార్చుకోవాలని హెచ్చరించారు. సర్టిఫికెట్‌ జారీలో జాప్యం జరిగినప్పుడు అందుకు గల కారణాలను తెలియజేయాలని ఆదేశించారు. బాధ్యతగా విధులు నిర్వహించాలని అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పమని హెచ్చరించారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయ భవనానికి అవసరమైన మరమ్మతు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డీటీలు దీపిక, ఖదీర్‌, ఆర్‌ఐ శరత్‌నాయక్‌ ఉన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 11:23 PM