Share News

అనుమతుల్లేని రైస్‌మిల్లు కూల్చివేత

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:34 PM

వనపర్తి జిల్లాలోని కొత్తకోట, పెద్దమందడి మండలాలోని రైస్‌ మిల్లులను అధికారులు గురువారం తనిఖీ చేశారు

అనుమతుల్లేని రైస్‌మిల్లు కూల్చివేత
ఎక్స్‌కవేటర్‌ సహాయంతో రైస్‌మిల్లును కూల్చివేయిస్తున్న అధికారులు

పెద్దమందడి/ కొత్తకోట, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లాలోని కొత్తకోట, పెద్దమందడి మండలాలోని రైస్‌ మిల్లులను అధికారులు గురువారం తనిఖీ చేశారు. అనుమతి లేకుండా నిర్మించిన రైస్‌మిల్లును అధికారులు కూల్చి వేయించారు. వనపర్తి జిల్లా, పెద్దమందడి పరిధిలోని మోజర్ల సమీపంలో సర్వే నెంబర్‌ 327లో చాముండి పేరుతో రైసుమిల్లు నిర్మించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆ రైస్‌మిల్లుకు నాలా, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, బోరుబావి, భవన నిర్మాణం తదితరాలకు అనుమతులు లేవని తేలింది. నిబంధనల ప్రకారం మిల్లు యజమానులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. కానీ వారు అనుమతి పత్రాలు సమర్పించలేదు. సీఎంఆర్‌ విషయం లోనూ అక్రమాలకు పాల్పడినట్లు గతంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో గుర్తించారు. అందుకు రూ. 13,33,11,523 చెల్లించాలని నోటిసులు ఇచ్చినా యజమాని స్పందించలేదు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎంపీడీవో పరిణితి, ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైస్‌మిల్లును కూల్చివేయించారు. కొత్తకోట మండలం, విలియంకొండ శివారులోని సాంబశివ రైస్‌మిల్లును తనిఖీ చేశారు. మిల్లు నిర్మాణానికి అనుమతులు లేవని, 10 రోజుల్లో తీసుకొని సమర్పించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. అలాగే రూ.4 కోట్ల విలువైన కస్టమ్‌ మల్లింగ్‌ రైస్‌ అప్పగించలేదని అధికారులు తెలిపారు.

Updated Date - Aug 27 , 2026 | 11:34 PM