పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదు
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:31 PM
అభివృద్ధి పేరున పేదల ఇళ్లు కూల్చడం సరికాదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.
- పరిహారంతో పాటు ఇంటి స్థలాన్ని కేటాయించాలి
- మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
- మద్దూర్‌లో రోడ్డు విస్తరణ బాధితులను పరామర్శ
మద్దూర్, సెస్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పేరున పేదల ఇళ్లు కూల్చడం సరికాదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్‌లో చేపట్టిన రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులను బుధవారం మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి నష్టపోయిన వారి స్థితిగతులను తెసుకున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా ఇళ్ల ముందు ఎర్త్‌మూవర్లు పెట్టి బెదిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లల్లో ఉన్న సామగ్రిని సైతం తీయడానికి సమయం ఇవ్వకుండా నిర్ధేశిత మార్కింగ్ ప్రకారం మిగిలిన ఇంటిని కట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించడం లేదని పలువురు బాధితులు మాజీ ఎమ్మెల్యే ముందు వాపోయారు. విస్తరణలో ఇళ్లు కోల్పోయిన తాము ఎక్కడికి పోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్ రోడ్డును ఇంత పెద్ద మొత్తంలో విస్తరించి పేదలకు ఇళ్లు లేకుండా చేయడం ప్రభుత్వానికి తగదని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో అంతర్గత రోడ్డును 60 ఫీట్ల మేర విస్తరించడం ఎందుకని ఇది 30 లేదా 40 వరకే విస్తరిస్తే బాధితులు ఇంత పెద్దమొత్తంలో నష్టపోయే వారు కాదని మాజీ ఎమ్మెల్యే అన్నారు. విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న 84 మంది బాధితులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు ఇంటి స్థలాన్ని కేటాయించి వారికి డబుల్ బెడ్‌రూంలు కట్టి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అలాగే విస్తరణ సందర్భంగా బాధితుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న డీఈ అంజి రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు స్థానిక పాత బస్టాండ్‌లో ధర్నా చేశారు. కౌన్సిలర్లు దినేష్, నర్సింహ, శివకుమార్, గోపాల్, మౌలానా, లింగానాయక్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకుడు అంజయ్య తదితరులు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు.