మృత్యువలయం
ABN , Publish Date - May 19 , 2026 | 11:33 PM
పాలమూరు నగరం చుట్టూ మృత్యుకేకలు వినిపిస్తున్నాయి.. రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన రహదారి నిత్యం నెత్తురోడుతోంది...
- 20 రోజులు..10 మరణాలు... 33 మంది క్షతగాత్రులు
- అదుపు తప్పి డివైడర్లను ఢీకొంటున్న వాహనాలు
- బారికేడింగ్‌లతో సరిపెడుతున్న అధికార యంత్రాంగం
- నిరంతర పెట్రోలింగ్, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు అవసరం
- రోడ్‌సేఫ్టీపై నేడు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష
మహబూబ్‌నగర్, మే 19 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు నగరం చుట్టూ మృత్యుకేకలు వినిపిస్తున్నాయి.. రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన రహదారి నిత్యం నెత్తురోడుతోంది... విపరీతమైన వేగం.. నిబంధనలను పాటించకపోవడం.. వాహనదారుల నిర్లక్ష్యం.. వెరసి తరచూ ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఇటు పిస్తాహౌస్ నుంచి అటు కోయిలకొండ ఎక్స్ రోడ్ వరకు ఉన్న బైపాస్ రహదారి ప్రమాదాలకు కేరా ఫ్ అడ్రస్‌గా మారుతోంది. గత నెల 30 నుంచి ఈ నెలలో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. 33 మంది క్షతగాత్రులయ్యారు. చించోళి రహదారి పనులు కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నా, వాటిపై రాకపోకలు సాగుతున్నాయి. అక్కడక్కడా మట్టికట్టలు వేసినా, ద్విచక్ర వాహన దారులు ఎక్కడోచోట దారి ఏర్పాటు చేసుకుని వెళ్తుండటం ప్రమాదాలకు కారణమవుతోంది. బైపాస్‌తో పాటు నగరంలోని రోడ్లపైనా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు వాహనాలు డివైడర్‌లను ఢీకొంటున్నాయి. ప్రధానంగా సీసీ కెమెరాలు లేకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడం, అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్, వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది..
కుటుంబాలు చిన్నాభిన్నం
రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రమాదంలో ఇంటి పెద్దను కోల్పోవడం, చేతికి వచ్చిన కొడుకు చనిపోవడం లేదంటే తీవ్రంగా గాయపడటం ఆ కుటుంబాన్ని కొలుకోలేని దెబ్బతీస్తోంది. ఇటీవల బైపాస్ రహదారిలో పాలకొండ వద్ద జరిగిన కారు, బైక్ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రెండు కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకుల కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీసింది. కోయిల్ కొండ ఎక్స్‌రోడ్‌లో 15 రోజుల క్రితం ఆటో, బొలెరో వాహనం ఢీకొని ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పాలకొండ వద్ద నాలుగు రోజుల క్రితం బొలెరో ఆటో బోల్తా పడటంతో బాలుడు చని పో గా, 20 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు దివ్యాం గులు కావడంతో, ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు రోజుల క్రితం కోయిలకొండ ఎక్స్‌రోడ్‌లో రాత్రి వేళ మట్టిదిబ్బలను ఢీకొని నవాబ్ పేటకు చెందిన వ్యక్తి చనిపోయాడు. ఇంటిపెద్ద అకాల మరణం ఆ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నాలుగు రోజుల క్రితం నగరంలోని మర్లులో కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డోర్ తెరవడంతో పక్కనుంచి స్కూటీ పై వెళ్తున్న స్టాఫ్‌నర్సు తీవ్రంగా గాయపడి మృతి చెం దింది. పిస్తాహౌస్ దగ్గర ఓ ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఆరుగురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ ప్రమాదాలన్నీ ఈ పది రోజుల వ్యవధిలోనే జరిగాయి. అంతకు ముందు ఏనుగొండలో ఓ కారు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులుండగా, అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పిస్తాహౌస్ నుంచి ఏనుగొండ వరకు అతివేగంగా దూసుకెళుతున్న కార్లు, బొలేరో వాహనాలు అదుపుతప్పి డివైడర్లను ఢీకొంటున్నాయి. ఇలా నగరంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రత్యేక దృష్టి సారించాలి
నగరంలో పిస్తాహౌస్ నుంచి కోయిలకొండ ఎక్స్‌రోడ్ వరకున్న దాదాపు 9 కిలోమీటర్ల రహదారిపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో వ్యతిరేకదిశలో వాహనాల రాకపోకలు ఎక్కువగా సాగుతున్నాయి. డివైడర్‌లను ధ్వంసం చేసి రూట్లను ఏర్పాటు చేసుకోవడం, యూటర్న్‌ల వద్ద నిర్లక్ష్యంగా వాహనాలను మలపడం, మితిమీరిన వేగం, బహిరంగ ప్రదేశాలలో మద్యపానం, మద్యం తాగి వాహనాలను నడపడం తదితర కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి నివారణకు నగరంతో పాటు బైపాస్ రహదారిపై సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాల్సి ఉంది. అలాగే నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలి. ప్రమాదం జరిగినపుడు రెండు రోజులు హడావిడి చేసి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్‌సేఫ్టీపై బుధవారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ సమక్షంలో ఆర్‌అండ్‌బీ, మునిసిపల్, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్టీసీ, పోలీస్‌శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.