సిలిం‘డర్’!
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:26 PM
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నది ఒక సామెత.. ప్రస్తుత పరిస్థితికి ఈ సామెత సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు.
- వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హోటళ్లలో కష్టాలు
- కట్టెల పొయ్యిలపై పరిమిత వంటకాలు.. కొన్నిచోట్ల మూసివేత
- చాయ్ డబ్బాలకూ తప్పని తిప్పలు..స్టాక్ లేకపోవడంతో ఇక్కట్లు
- బ్లాక్‌లో సబ్సిడీ సిలిండర్లు.. తనిఖీలు చేయని అధికారులు
- బుకింగ్ వ్యవస్థ నిలిపివేత.. గతంలో కంటే డెలివరీ ఆలస్యం
- కొన్ని ఏజెన్సీల పరిధిలో అర్జంటుగా కావాలంటే అదనంగా వసూళ్లు
మహబూబ్‌నగర్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నది ఒక సామెత.. ప్రస్తుత పరిస్థితికి ఈ సామెత సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. అమెరికా- ఇరాన్- ఇజ్రయెల్ యుద్ధ ప్రభావం సామాన్యులపై పడటం మెల్లిమెల్లిగా మొదలైంది. నిత్య జీవితంలో అత్యంత కీలకమైన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లలో సింహభాగం హర్మూజ్ జలసంధి నుంచే రావాల్సి ఉండగా.. అక్కడ నెలకొన్న పరిస్థితులతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరత లేకపోయినప్పటికీ, గ్యాస్ కొరత ఏర్పడకుండా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వాణిజ్య సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరను కూడా రూ. 60 పెంచింది. ఇప్పటికిప్పుడు గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదు కానీ, వాణిజ్య సిలిండర్లు, బ్లాక్ సబ్సిడీ సిలిండర్లు ఉపయోగించే హోటళ్లపై భారీ ప్రభావం పడింది. గతంలో భారీ వంటకాలకు కట్టెల పొయ్యిల బట్టీలనే వినియోగించేవారు. కానీ కాలక్రమంలో గ్యాస్ విరివిగా దొరకడం, అన్ లిమిటెడ్ డిషెష్ అందుబాటులోకి రావడంతో గ్యాస్ వినియోగం తప్పనిసరి అయ్యింది. ఇప్పుడు గ్యాస్‌పై ఆధారపడటం హోటళ్ల నిర్వాహకులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు వాణిజ్య సిలిండర్ బుకింగ్‌ను పూర్తిగా నిలిపివేయడంతో వంటలు ఎలా చేయాలో తెలియని పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో నెలకొన్నాయి. గ్యాస్ కొరతతో హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే సోమవారం రెస్టారెంట్లకు సెలవు ప్రకటించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉమ్మడి జిల్లాలో హోటళ్లను మూసివేయడం లేదా సెలవులు ప్రకటించడం తథ్యమనే అభిప్రాయం నెలకొంది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో ఇప్పటికే కొన్ని టిఫిన్ సెంటర్లు మూతపడగా.. చాయి డబ్బాలు కూడా నడవడం లేదు. ప్రముఖ హోటల్ అయిన శిల్పిలో గ్యాస్‌కు బదులు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకున్నారు. రెగ్యులర్ డిషెష్ కాకుండా కేవలం బిర్యానీ, వైట్‌రైస్, కర్రీస్‌కు పరిమితమవుతున్నారు. మిగతా హోటళ్లలో కూడా లిమిటెడ్ డిషెష్ చేస్తున్నారు. మాటిమాటికీ గ్యాస్ వినియోగించే వంటల జోలికి పోకూడదని నిర్ణయించుకున్నట్లు హోటళ్ల యజమానులు తెలుపుతున్నారు.
పనిచేయని బుకింగ్ వ్యవస్థ
ప్రభుత్వం అధికారికంగా వాణిజ్య సిలిండర్ సరఫరాను మాత్రమే నిలిపివేసింది. యుద్ధం ఇలాగే కొనసాగితే గృహ అవసరాలు తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కానీ బుకింగ్ వ్యవస్థ అటు వాణిజ్య సిలిండర్‌కు.. ఇటు గృహ వినియోగ సబ్సిడీ సిలిండర్‌కు పనిచేయడం లేదు. గతంలో ప్రతీ వినియోగదారుడు ఆయా పంపిణీ సంస్థ ఇచ్చిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే.. రింగ్ అయి కట్ అయిన తర్వాత బుక్ అయినట్లు మెసేజ్ వచ్చేది.. ఒక్క రోజులోనే డెలివరీ కూడా అయ్యేది. కానీ ఇప్పుడు ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే పనిచేయడం లేదు. ‘దిస్ నెంబర్ డస్ నాట్ అవైలబుల్’ అని వస్తోంది. దీంతో నేరుగా ఏజెన్సీలకు వెళ్లి వినియోగదారులు భయాందోళనతో ఎక్కువ బుకింగ్స్ చేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే బుక్ చేసిన అయిదు రోజులకు సిలిండర్ డెలవరీ అవుతోంది. గతంలో బుకింగ్ గ్యాప్ 21 రోజులు ఉండగా.. ప్రస్తుతం 30 రోజులకు పెంచారు. అయినా ఒత్తిడి భారీగా ఉంది. ఆందోళనతో ఏజెన్సీల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. గతంలో బ్లాక్‌లో సబ్సిడీ సిలిండర్లు తీసుకునే హోటళ్ల నిర్వాహకులు కూడా ఇప్పుడు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సబ్సిడీ సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేసి హోటళ్లను నిర్వహిస్తున్నారు. గృహ వినియోగ గ్యాస్ దుర్వినియోగ కట్టడికి హైదరాబాద్‌లో తనిఖీలు చేస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో పెద్దగా కనిపించడం లేదు. చాలాచోట్ల కేవలం అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు. అలాగే ఇప్పటికే సిలిండర్‌పై ధర రూ. 60 పెరగ్గా.. తొందరగా సిలిండర్ కావాలంటే పలు ఏజెన్సీల్లో అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే డెలవరీ బాయ్స్ కూడా తొందరగా సిలిండర్ కావాలంటే అదనపు మొత్తం తీసుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.
ఉమ్మడి జిల్లాలో ఇలా...
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం ఉజ్వల, దీపం పథకాలతో కలిపి గృహ వినియోగ సిలిండర్ కనెక్షన్లు 8,83,660 ఉన్నాయి. భారత్, ఇండియన్, హెచ్‌పీ గ్యాస్ వంటి పంపిణీ సంస్థలు నిత్యం సరఫరాను చేస్తున్నాయి. వీటితో పాటు వేల సంఖ్యలో కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఎక్కువ హోటళ్లలో సబ్సిడీ సిలిండర్లనే వినియోగిస్తున్నందున కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లను తీసుకోలేదు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 3.14 లక్షల కనెక్షన్లు ఉండగా.. మెజారిటీ డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. డబుల్ సిలిండర్ కనెక్షన్ల వారు ఎప్పుడూ ఒక నిండు సిలిండర్‌ను అదనంగా ఉంచుకుంటారు కాబట్టి వారికి ప్రస్తుతం ఎలాంటి ఆందోళన లేదు. కానీ సింగిల్ సిలిండర్ వినియోగదారులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీపం, ఉజ్వల వంటి పథకాల లబ్ధిదారులకు సింగిల్ సిలిండర్ మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో బుకింగ్ నెంబర్ పనిచేయకపోవడంతో ఆందోళన చెంది.. వారి ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. డెలవరీ చేస్తామని చెబుతున్నా.. తామే తీసుకెళ్తామని పట్టుబడుతున్నారు. కొన్ని మండలాల్లో డబుల్ ఏజెన్సీలు ఉండగా.. కొన్నింటిలో సింగిల్ ఏజెన్సీలే ఉన్నాయి. అలాంటి చోట్ల వినియోగదారులకు ఎక్కువ ఇబ్బంది అవుతోంది. ఆందోళన పెరగకుండా గ్యాస్ లభ్యతను ప్రకటించి.. బుకింగ్ నెంబర్ యథావిధిగా పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.