ముమ్మరంగా పంట నమోదు ప్రక్రియ
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:25 PM
రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, పంట ఉత్ఫత్తులకు ఇబ్బంది లేకుండా విక్రయించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంట నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.
- 75 శాతం సర్వే పూర్తి
- గూగుల్ మ్యాప్ ఆధారంగా జియో ట్యాగింగ్
దేవనరకద్ర, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, పంట ఉత్ఫత్తులకు ఇబ్బంది లేకుండా విక్రయించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంట నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గూగుల్ మ్యాప్ ఆధారంగా గతానికి భిన్నంగా సర్వేయర్ ద్వారా డిజిటల్ పద్ధతిలో పంటల వివరాలు సేకరిస్తున్నారు. సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసిన అనంతరం ఏఈవోలు వాటిని ధ్రువీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు
గూగుల్ మ్యాపుతో ఆన్‌లైన్ సర్వే..
వానాకాలం సీజన్‌లో భాగంగా రైతులు సాగు చేస్తున్న పంటలను గూగుల్ మ్యాపు ఆధారంగా డిజిటల్ క్రాప్ సర్వే తెలంగాణ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. మ్యాపు సూచించిన సర్వే నంబర్ల వారీగా పంట సృష్టంగా కనిపించేలా ఫొటోలు తీసి పొలంలో సాగవుతున్న పంట వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. సర్వేయర్లు, ఏఈవోలు సంయుక్తంగా ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేస్తున్నారు. నియోజకవర్గంలోని దేవరకద్ర మండలంలో 25,370 ఎకరాలు, భూత్ఫూర్ మండలంలో 24,366 ఎకరాలు, మూసాపేట మండలంలో 8,136 ఎకరాలు, అడ్డాకుల మండలంలో 17,729 ఎకరాలు, చిన్నచింతకుంట మండలంలో 24,670 ఎకరాలు, కౌకుంట్ల మండలంలో 16,146 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఆ వివరాలను అధికారులు డిజిటల్ సర్వే ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. వెంటనే రైతుల యొక్క ఫోన్‌లకు వ్యవసాయశాఖ ద్వారా సమాచారం అందుతుంది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పంట నమోదు దాదాపు 75శాతం పూర్తిఅయింది.
పంట నమోదు తప్పనిసరి.. రాజేంద్ర అగర్వాల్, ఏవో
ప్రతీ రైతు పంటల వివరాలను డిజిటల్ సర్వే ఆధారంగా పొలం వద్దకు వెళ్లి ఆన్‌లైన్ నమోదు చేస్తున్నాం. దీంతో రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుంది. జియో ట్యాగింగ్ ద్వారా సర్వే పూర్తైన వెంటనే సదరు రైతు ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. ఒక వేళ నమోదులో ఏమైనా అభ్యంతరాలు లేదా తప్పులు ఉంటే, మెసేజ్ వచ్చిన 72 గంటల వ్యవధిలో రైతులు తమ క్లస్టర్ ఏఈవోను సంప్రదించాలి. అన్ని మండలాల్లో పంట వివరాల నమోదు పకడ్బందీగా కొనసాగుతోంది.