Share News

ఉపాధి హామీకి కౌంట్‌డౌన్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 10:57 PM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. మే 1 నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్‌ జీ(వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌)గా మార్చనుంది. ఈ నేపథ్యంలో ఉపాఽధి హామీ పథకంలో పాత పనులు ఈనెలాఖరు వరకే చేసుకోవాల్సి ఉంటుంది.

ఉపాధి హామీకి కౌంట్‌డౌన్‌
మూసాపేట మండలం పోల్కంపల్లిలో ఒండ్రుమట్టి తరలింపు పనులు చేపడుతున్న కూలీలు

వచ్చే నెల 1 నుంచి పథకం వీబీ జీ రామ్‌ జీగా మార్పు

ఈ నెలాఖరు వరకు పాత పనులు చేసుకునే అవకాశం

కొత్త పథకంలో గ్రామ పంచాయతీలకే పవర్స్‌

125 రోజులకు పెరుగనున్న పని దినాలు

ఒండ్రు మట్టి తరలింపునకు మే వరకు అవకాశం ఇవ్వాలంటున్న రైతులు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. మే 1 నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్‌ జీ(వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌)గా మార్చనుంది. ఈ నేపథ్యంలో ఉపాఽధి హామీ పథకంలో పాత పనులు ఈనెలాఖరు వరకే చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త పథకంలో 266 రకాల పనులను పొందుపరిచినా, అందుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు మాత్రం విడుదల కాలేదు. ఇది వరకు 100 రోజుల పని దినాలు ఉండగా 125 రోజులకు పెంచడం, పనుల ఎంపిక అధికారాలు గ్రామ పంచాయతీలకే అప్పగించడం వంటి మార్పులు మేలు చేయనుండగా, భూమి చదును, ఒండ్రుమట్టి తరలింపు వంటి పనులను తొలగించడం సరికాదని రైతులు అంటున్నారు.

- మహబూబ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి)

ఉపాధి హామీ పథకం ఇక మారనుంది. మే 1 నుంచి ఈ పథకాన్ని కేంద్రం వీబీ జీ రామ్‌ జీగా మార్చడంతో పాటు పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసింది. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం ఒక కుటుంబానికి 100 రోజుల పని దినాలు మాత్రమే కల్పిస్తోంది. అదే వీబీ జీ రామ్‌జీ పథకంలో మాత్రం ఒక జాబ్‌కార్డుకు 125 రోజుల పని దినాలు కల్పించనుంది. ఇది కూలీలకు కలిసొచ్చే అంశం. కూలి రూ.307 ఇవ్వనున్నారు. ప్రస్తుతం చేసే చాలా పనులు మే నుంచి కనిపించవు. అందులో ఒండ్రుమట్టి తరలించే పనులను, రైతులు తమ పొలాల్లో చేసుకునే భూ అభివృద్ధి(ల్యాండ్‌ లెవెలింగ్‌) పనులు, కంపచెట్ల తొలగింపు పనులను నిలిపివేశారు. అందుకే అధికారులు పాత పనులు ఈ నెలాఖరులోగా చేయించాలని సిబ్బంది వెంట పడుతున్నా ఎండల కారణంగా పనులు చేసేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు.

గ్రామ పంచాయతీలకే అధికారాలు

ఉపాధిహామీ పథకంలో మండలానికి పనులు ఎంపిక చేసే అధికారాలు ఉండేవి. వీబీ జీ రామ్‌జీలో గ్రామ పంచాయతీలకు పనుల ఎంపిక అధికారాలను కట్టబెట్టారు. ముఖ్యంగా నీటి నిల్వ పనులు, మౌలిక వసతుల కల్పన, శాశ్వత నిర్మాణాలు, ప్లాంటేషన్‌ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామాలలో కావలసిన మౌలిక వసతులు అంటే అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల్లో బాత్‌రూమ్‌ల నిర్మాణం, సీసీరోడ్లు, డ్రైనేజీ వం టి పనులు గ్రామ పంచాయతీ తీర్మానంతో చేసుకునే అధికారం ఇస్తున్నారు. అదేవిధంగా నీటి నిలువ పనుల్లో చెక్‌డ్యామ్‌లు, ఊట కుంటల నిర్మాణం వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ప్లాంటేషన్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. కచ్చితంగా గ్రామ పంచాయతీ లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీలకు సం బంధించి ఇప్పటివరకు వినియోగంలో లేని ప ొలాల భూ అభివృద్ధి పనులు మాత్రం చేసుకునేందుకు కొత్త పథకంలో అవకాశం ఇస్తున్నారు.

ఒండ్రుమట్టి పనులు ప్రారంభం

ఉపాధిహామీ పథకం కింద రైతులు తమ పొలాలలో ఒండ్రుమట్టి వేసుకు నేందుకు పనులు ప్రారంభించారు. గ్రామాలలో ఉన్న చెరువుల నుంచి మట్టిని తోడి, ట్రాక్టర్ల సాయంతో రైతులు పొలాలకు తరలిస్తారు. సౌడు నేలలకు ఒండ్రుమట్టి వేస్తే పొలాలు సారవంతం అవుతాయి. ట్రాక్టర్‌లకు మట్టి వేసేందుకు లేబర్‌కు కూలి ఉపాధిహామీ పథకం ద్వారా చెల్లిస్తుండగా, ట్రాక్టర్‌ల కిరాయి మాత్రం రైతులే భరించాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే పలు గ్రామాల్లో ఈ పనులు ప్రారంభం అయ్యాయి. నీళ్లు లేని చెరువుల నుంచి మట్టిని తరలిస్తున్నారు. లేబర్‌ కూడా ఒండ్రుమట్టి తీసే పని సులువుగా ఉండటంతో ఈ పనులు చేసేందుకు పెద్ద ఎత్తున వస్తారు. వచ్చేనెల అయితే చాలా చెరువుల్లో నీళ్లు ఖాళీ అవుతాయి. అప్పుడు పెద్దఎత్తున మట్టి తరలింపు పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా మే వరకు మట్టి తరలింపునకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా, అది సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కొత్త పథకంలో ఈ పనులకు అవకాశం లేనందున ఈ నెలాఖరులోగానే చేసుకోవాల్సి ఉంటుంది.

100 రోజులు పని పూర్తి చేసిన 1,703 కుటుంబాలు

ఉమ్మడి పాలమూరులో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,703 కుటుంబాలు 100 రోజుల పని దినాలు పూర్తిచేసుకున్నాయి. ఇప్పుడు కొత్త పథకంలో ఇలాంటి వారంతా 125 రోజులు పని చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మహబూబ్‌నగ ర్‌ జిల్లాలో 76 వేల ఆక్టివ్‌ జాబ్‌కార్డులు ఉండగా, 475 కుటుంబాలు 100 రోజుల పని పూర్తి చేసుకున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 85 వేల జాబ్‌కార్డులకు 261 కుటుంబాలు, నాగర్‌కర్నూల్‌లో 1.04 లక్షల జాబ్‌కార్డులకు 388 కుటుంబాలు, నారాయణపేట జిల్లాలో 65 వేల జాబ్‌కార్డులకు 167 కుటుంబాలు, వనపర్తి జిల్లాలో 71 వేల జాబ్‌కార్డులకు 412 కుటుంబాలు 100 రోజుల పని పూర్తి చేసుకున్నాయి. కొత్త పథకంలో ఎక్కువ మందికి ఎక్కువరోజులు పని చేసుకునే అవకాశం కలుగనుంది.

Updated Date - Apr 18 , 2026 | 10:57 PM