సహకారం.. ఇంకా దూరం..!
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:02 AM
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.. గతంలో ఇతర పార్టీలకు వలసపోయిన నేత లు సైతం తిరిగి పార్టీలో చేరారు.
ఉమ్మడి జిల్లాలో సొసైటీ పాలకవర్గాల నియామకంలో ఆలస్యం
పలు జిల్లాల్లో పీఏసీఎస్‌ల డైరెక్టర్లు, చైర్మన్ల ఎంపిక తంతు పూర్తి
నామినేటెడ్ పద్ధతిపై కోర్టుకు వెళ్లడంతో పాతవారే కొనసాగింపు
ఈ పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడంతో ఆందోళన
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.. గతంలో ఇతర పార్టీలకు వలసపోయిన నేత లు సైతం తిరిగి పార్టీలో చేరారు. పార్టీ పెద్దలు ఆశీర్వదిస్తే స్థానిక సంస్థలు లేదా ఏదైనా నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం వస్తుందని ఆశించిన నాయకులు, కార్యకర్తలకు సర్పంచు, మునిసిపాలిటీ ఎన్నికలు కొంత సాంత్వన చేకూర్చాయి. అయినప్పటికీ గ్రామాల్లో తీవ్ర పోటీ నెలకొనగా.. కొందరికి ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల ఆశచూపి.. ఎమ్మెల్యేలు ఎన్నికలను గట్టెక్కించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ శ్రేణులను పదవుల్లో భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు ఎన్నికల ద్వారా కాకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకవ ర్గాలను నియమించాలని నిర్ణయించి జీవో విడుదల చేసింది. అయితే నామినేటెడ్ పద్ధతితో పాటు ఎన్నికలు ని ర్వహించే వరకు పర్సన్ ఇన్చార్జీలను కాకుండా పాత పాలకవర్గాలనే కొనసాగించాలని పలువురు కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ కొన్ని జిల్లాల్లో పూర్తవగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పూర్తి కాలేదు. ఒక్కటంటే ఒక్క పాలకవర్గానికి కూడా డైరెక్టర్లు, చైర్మన్ల ఎంపిక చేపట్టలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో భాగంగా ఉన్న రంగారెడ్డి డీసీసీ పరిధిలోని గండీడ్ మండలానికి ఎంపిక పూర్తయ్యింది.
77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘంలో చైర్మన్, వైస్‌చైర్మన్ సహా 13 మంది నియమితులు అవుతారు. ప్రస్తుతం అన్ని సొసైటీల పరిధిలో పాత పాలక వర్గాలనే కొనసాగిస్తున్నారు. 2016లోనే జిల్లాలు విడిపో యినప్పటికీ ఒక్క డీసీసీబీ మాత్రం ఉమ్మడి జిల్లాగా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి పోయిన షాద్‌నగర్ నియోజకవర్గం, మాడుగుల, తలకొండపల్లి, అమనగల్లు, కడ్తాల్, వికారాబాద్ జిల్లా పరిధిలోకి పోయిన కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల్ వంటి మండలాలు కూడా ఈ పరిధిలోనే కొనసాగుతున్నాయి. అయితే సొసైటీల పాలకవర్గాలపై ఆశలు పెట్టుకున్న చాలామంది ఎప్పుడు నియామ కంపూర్తవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. కోర్టుకు వెళ్లిన సొసైటీలు మినహా మిగతా పాలకవర్గాలకు నామినేటెడ్ పద్ధతిలో పూర్తిచేసే అవకాశం ఉన్నా.. ఒక్కచోట ప్రారంభిస్తే మిగతా సొసైటీల పరిధిలో కూడా ఒత్తిడి పెరుగుతుందనే భావన ఎమ్మెల్యేల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదనే అసంతృప్తి ఉంది. నామినేటెడ్ లేదా ఎన్నికల ద్వారా ఎలా భర్తీ చేసినా అభ్యంతరం లేదనే వారు కూడా ఉన్నారు.
రెండుసార్లు పదవీకాలం పొడిగింపు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు గత ప్రభుత్వ హయాంలో 2020లో ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ దాదాపు అన్ని సొసైటీలను కైవసం చేసుకుని.. మహబూబ్‌నగర్ డీసీసీబీ పీఠాన్ని సొంతం చేసుకున్నది. నిజాంపాషా చైర్మన్‌గా ఎన్నికవగా.. ఆయన అనారోగ్య కారణాలతో నాలుగేళ్ల తర్వాత తప్పుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పాలక వర్గాలు.. డీసీసీబీ చైర్మన్‌గా మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డిని ఎన్నుకున్నాయి. ఆయనతో పాటు సొసైటీల పదవీకాలం 2025 ఫిబ్రవరిలో ముగిసింది. దీంతో ప్రభుత్వం 2025 ఆగస్టు 14 వరకు అంటే దాదాపు ఆరునెలల పదవీ కాలాన్ని పొడిగించింది. ఆ తర్వాత మళ్లీ పొడిగిస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా ఆరు నెలలపాటు కొనసాగుతాయని పేర్కొంది. అనంతరం డిసెంబరు 19న పాలకవర్గాలను రద్దు చేస్తూ.. సొసైటీలకు పర్సన్ ఇన్చార్జీలను నియమించింది. దీనిపై చాలా సొసైటీలు కోర్టుకు వెళ్లాయి. ఆలా వెళ్లిన సొసైటీల్లో కొంతమేర పాత వారినే కొనసాగించాలని ఆదేశించింది. ఇదే సమయంలో డిసెంబరు 23న వ్యవసాయ మార్కెట్ కమిటీల మాదిరిగానే నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేయాలని నిర్ణయించింది. కొన్ని జిల్లాల్లో ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేయగా.. ఉమ్మడి జిల్లాలో ఆ చర్యలే చేపట్టలేదు. దీనిపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వెల్లడ వుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పు డు నిర్వహిస్తారో స్పష్టత లేకుండా పోగా.. వాటిపై ఆ శపడిన వారు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. అలాగే రాష్ట్ర, జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టులు సైతం పలు చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు సొసైటీల్లో డైరెక్టర్లు, చైర్మన్ల నియామకంలో స్పష్టత లేకపోవడం.. మరో రెండు సంవత్సరాల్లోపే ఎన్నికల వాతావరణం రానుండటంతో వారిలో ఆందోళన నెలకొంది.
చైర్మన్ పీఠంపై ఫోకస్
పాలమూరు డీసీసీబీ రాష్ట్రంలోనే అతిపెద్ద సహకార సొసైటీల్లో ఒకటి.. డీసీసీబీ చైర్మన్ పదవిని చాలా కీలకంగా భావిస్తారు. ఉమ్మడి జిల్లాకు కలిపి ఉన్న ఏకైక సంస్థ కూడా ఇదే కావడంతో ఆ ప్రొటోకాల్ కూడా ఉంటుం ది. ఈ నేపథ్యంలో ఈ పదవిపై చాలామంది ఆశలు పెట్టుకోవడం సహజం. గతంలో రెండుసార్లు డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డి ఆమేర పేరు సాధించారు. ఇప్పుడు ఆయన తనయుడు కె ప్రశాంత్‌కు మార్రెడ్డి కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి ఆయన టిక్కెట్ ఆశించారు. కానీ సామాజిక సర్దుబాట్లు.. సీనియారిటీ దృష్ట్యా ఆ టికెట్‌ను వాకిటి శ్రీహరికి కేటాయించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు. దీంతో అదే సీటుపై ఆశలు పెట్టుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరిగితే ఏదో నియోజకవర్గానికి వెళ్లే అవకాశం ఉండగా.. అది ఉంటుందా? లేదా అనేది తెలియడం లేదు. అలాగే పార్టీ నుంచి కూడా ప్రశాంత్‌రెడ్డికి హామీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కోర్టు కేసుల చిక్కులు తొలగి.. డైరెక్టర్లు, చైర్మన్ల నియామకం పూర్తయితే స్పష్టత వస్తుంది. అలాగే మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సంవత్సరన్నర మాత్రమే తనకు అవకాశం వచ్చిందని, మరో సారి డీసీసీబీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ ఎవరికి అవకాశం దక్కుతుందో.. అసలు ఇప్పట్లో పాలక వర్గాల నియామకం పూర్తవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.