Share News

ఓట్ల తొలగింపునకు కుట్ర

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:53 PM

గత ఎన్నికలో బొటాబొటీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఈ సారి ఓడిపోతామని భావించి సర్‌ పేరిట కుట్రలకు తెరతీసిందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

ఓట్ల తొలగింపునకు కుట్ర
ధర్నాలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేదికపై డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌, ఎమ్మెల్యే జీఎంఆర్‌

- ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌కుమార్‌ రాజీనామా చేయాలి

- ప్రభుత్వ విప్‌, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో భారీ ధర్నా

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గత ఎన్నికలో బొటాబొటీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఈ సారి ఓడిపోతామని భావించి సర్‌ పేరిట కుట్రలకు తెరతీసిందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. అందులో భాగంగానే ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్వర్‌కుమార్‌ను నియమించిందన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌ ఆధ్వర్యంలో సోమవారం పాలమూరు కలెక్టరేట్‌ ముందు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ ఎలక్షన్‌ కమిషన్‌లో ఒక చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇద్దరు కమిషనర్లు ఉంటారని తెలిపారు. సీనియర్లను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా నియమించాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా ఉన్న జ్ఞానేశ్వర్‌ను నియమించడం రాజకీయ కుట్ర అన్నారు. మోదీ, అమిత్‌షానుంచి వచ్చే ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ తూచా తప్పకుండా అమలు చేస్తోందని ఆరోపించారు. 2029లో మళ్ళీ బీజేపీని దొడ్డి దారిన అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోం దని విమర్శించారు.

సర్‌ పేరిట ఓట్ల చోరీ

డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ ప్రజల్లో రాహుల్‌గాంధీకి ఆదరణ పెరుగుతుండటంతో కేంద్రం కొత్త కుట్రకు తెరతీసిందని విమర్శించారు. ఎన్నికల కమిషనర్‌ను అడ్డుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేం దుకు ప్రయత్నం చేస్తోందన్నారు. సర్‌ పేరిట ఓట్ల చోరీకి పాల్పడుతోందని, రాష్ట్రంలోనే 90 లక్షల ఓట్లను తొలగిం చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర పభుత్వమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని విమర్శించారు. ధర్నాలో టీపీసీసీ అధికార ప్రతినిధి జీ హర్షవర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, నాయకులు ఆనంద్‌ కుమార్‌గౌడ్‌, దుశ్యంత్‌రెడ్డి, రబ్బాని, వినోద్‌కుమార్‌, చంద్ర కుమార్‌గౌడ్‌, సిరాజ్‌ఖాద్రీ, ఎన్‌పీ వెంకటేశ్‌, సీజే బెనహర్‌, జీ రాజేందర్‌రెడ్డి, లింగం నాయక్‌, సుధాకర్‌రెడ్డి, రాములు యాదవ్‌, నయీం పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:53 PM