తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలన
ABN , Publish Date - Nov 04 , 2026 | 10:36 PM
జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో నిరంతర తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను బుధవారం అదనపు కలెక్టర్, మునిసిపల్ ప్రత్యేక అధికారి మధుసూదన్‌నాయక్ పరిశీలించారు.
జడ్చర్ల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో నిరంతర తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను బుధవారం అదనపు కలెక్టర్, మునిసిపల్ ప్రత్యేక అధికారి మధుసూదన్‌నాయక్ పరిశీలించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మునిసిపల్ కమిషనర్ గిరీష్‌తో కలిసి పరిశీలించారు. బోర్లు పునరుద్దరించడం, పాత తాగునీటి వనరులను తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వంటి వాటిపై సమీక్షించారు. మునిసిపల్ ఏఈ గాయత్రీ, వాటర్‌సప్లై ఇన్‌చార్జి యాదయ్య పాల్గొన్నారు.
వీబీ జీ రాంజీ పనులు వేగవంతం చేయాలి
దేవరకద్ర : గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, రైతులకు వీబీ జీ రాంజీ కింద పనులు కల్పించాలని, పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నాగారంలో కొనసాగుతున్న వీబీ జీ రాంజీ పనులను పరిశీలించారు. ఎల్‌నినో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వీబీ జీ రాంజీ పథకం కింద ఫాంపాండ్‌ల నిర్మాణాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, సర్పంచు రాజేందర్‌రెడ్డి ఉన్నారు.
పనులు పూర్తి చేయాలి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ : లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేసే సమయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయాల్లో చేపట్టిన పనుల పురోగతి, ప్రస్తుత స్థితిగతులపై బుధవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి, పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, ఇతర ప్రాథమిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. హౌసింగ్ పీడీ ఉపేందర్‌రెడ్డి, డీఈ, ఏఈలు, మిషన్‌భగీరథ ఈఈ, డిప్యూటీ ఈఈ, ఏఈలు, విద్యుత్‌శాఖ ఏఈలు పాల్గొన్నారు.